Site icon vidhaatha

Jani Master | జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.. బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ అవార్డు రద్దు..!

Jani Master | లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. వేధింపుల కేసులో రంగారెడ్డి కోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డును అందుకునేందుకు బెయిల్‌ను కోరగా.. ఇందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే, అవార్డును అందుకునే ముందు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జానీకి ప్రకటించిన నేషన్‌ అవార్డును కమిటీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. లైంగిక వేధింపుల నేపథ్యంలో కొరియోగ్రాఫర్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైన క్రమంలో అవార్డును రద్దు చేశారు. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ మాస్టర్‌ని అవార్డు కమిటీ ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో అవార్డుల ప్రధానం ఈ నెల 8న జరుగాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే జానీకి ప్రకటించిన అవార్డును నిర్వాహకులు రద్దు చేశారు.

అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌కు అవకాశాల పేరుతో పలుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా.. పెళ్లి చేసుకోవాలని వేధించినట్లుగా ఆరోపణలున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ పోలీసుల బృందం గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీలో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 8న అవార్డు అందుకోవాల్సి ఉండడంతో నాలుగు వారాలు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, కేసులో ఎవరినీ ప్రభావితం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సి ఉండగా.. అవార్డు రద్దు చేయడం జానీ మాస్టర్‌ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే బెయిల్‌ని సైతం రద్దు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Exit mobile version