R.Narayana Murthy | నటుడు, దర్శకుడు, నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు ఆర్ నారాయణ మూర్తి. పీపుల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నారాయణమూర్తి పరిశ్రమకి వచ్చిన కొత్తలో దాసరి నారాయణరావుని కలిసారు. అప్పుడు ఆయనకి డిగ్రీ పూర్తి చేసి రమ్మని సలహా ఇచ్చారట. నటుడిగా సక్సెస్ కాకపోయిన ఏదైన ఉద్యోగం చేసుకోవచ్చని సలహా ఇచ్చారట. అలా డిగ్రీ పూర్తి చేశాక మళ్లీ దాసరిని కలవడంతో ఆయనకి తొలిసారి 1978లో ప్రాణం ఖరీదు మూవీలో చిన్న పాత్ర ఇచ్చారు. అనంతరం దాసరి నారాయణరావు సీతా రాములు చిత్రంలో ఓ అవకాశం ఇచ్చారు.అలా నారాయణమూర్తి తన సినిమా ప్రస్థానం కొనసాగించారు.
ఆయన డబ్బుల కోసం సినిమాలు చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా నచ్చని పాత్ర చేయనంటారు పీపుల్ స్టార్. ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు. చాలా నిరాడంబరమైన జీవితం గడుపుతుంటారు. అన్ని సినిమాలు చేసిన ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం సాగిస్తుంటారు. అయితే తాజాగా ఆయన స్వల్ప అస్వస్థతకి లోనైనట్టు తెలుస్తుంది. . ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు. పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి ఏమైదంటూ ఆయన అభిమానులు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై ఆర్ నారాయణమూర్తి స్పందించారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని ఓ ప్రకటనలో వెల్లడించారు నారాయణమూర్తి. పూర్తిగా కోలుకున్నాక అన్ని వివరాలు తెలియజేస్తానని అన్నారు. ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయవల్ల బాగా కోలుకుంటున్నానని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నారాయణ మూర్తి గతంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారని , దానికి సంబంధించిన టెస్టుల్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది.