Rajababu| నవ్వుల రేడు రాజబాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి సినిమాలోను తనదైన హాస్యంతో కడుపుబ్బ నవ్వించారు రాజబాబు. హీరోలకి సమానంగా రాజబాబు పారితోషికం ఉండేది. ఓ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలైతే రాజబాబుకు పారితోషికంగా రూ.20వేలు నిర్ణయించారు నిర్మాత. దీంతో కోపం తెచ్చుకున్న రాజబాబు తనకూ 35వేల రూపాయలు కావాల్సింసిందేనని పట్టుబట్టగా అప్పుడు నిర్మాత మీరు హీరో కాదు కదా అని అన్నాడు. దానికి రాజబాబు హీరోనే కమెడీయన్‌గా చూపించి సినిమాని విడుదల చేయమని అన్నాడు. ఈ విషయాన్ని రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఓ సందర్భంలో చెప్పారు.
రాజబాబు కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో రోజులు లెక్క కాకుండా గంటల లెక్కన రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఒక గంట ఎన్టీఆర్‌తో నటిస్తే, మరో గంట ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు సినిమాల్లో నటించిన రికార్డు ఆయనది. డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేంత బిజీగా మారిపోవడమే రాజబాబు కొంపముంచింది. సినిమాల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య అలిగి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది, ఆ ప్రభావం రాజబాబుపై బాగా పడింది. సున్నిత మనస్కుడైన రాజబాబుపై కుటుంబ కలహాలు తీవ్రమైన ప్రభావం చూపించాయని రమాప్రభ అన్నారు. భార్య వదిలేసి వెళ్లాక మద్యానికి బానిస కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. మరోవైపు సంపాదించినదంతా దానధర్మాలకే ఖర్చయిపోవడంతో ఆఖరి సమయంలో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు.
చివరికి 1983, ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని ఓ అస్పత్రిలో తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 45ఏళ్లు మాత్రమే. రాజమండ్రిలో పారిశుద్ధ్య పనులు చేసేవారి దుస్థితి చూసిన చలించిపోయిన ఆయన వారికోసం ఏకంగా ఓ కాలనీ కట్టించారు. రాజమండ్రిలోనే ఓ జూనియర్ కాలేజీని కూడా కట్టించారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ గుర్తుంచుకొని మరీ వారికి సాయం చేశారు. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాల్లో నటించిన రాజబాబు… వరుసగా 13 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొంది రికార్డు సాధించారు.. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్ర బాబు, మహేశ్‌బాబు. ప్రస్తుతం వారిద్దరు అమెరికాలో సొంత ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు తాను బాగా సంపాదించి కారు కొని తల్లికి చూపించాలనుకున్నారట. అయితే రాజబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండానే ఆమె కన్నుమూశారు. అలాగే రాజబాబు కుమారులు సొంతంగా ఎదిగి అమెరికాలో ప్రయోజకులైతే వారిని చూడకుండానే రాజబాబు తనువు చాలించడం విషాదకరం.