విధాత : నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ కామెడీ చిత్రం ‘థామా’ తాజాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా విడుదల సందర్భంగా రష్మిక సినిమా చిత్రీకరణలో తన అనుభవాలను ఎక్స్ లో పంచుకున్నారు. అలాగే మూవీ సెట్‌లో తీసిన కొన్ని బీటీఎస్ ఫొటోలను షేర్ చేశారు. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’, ‘స్త్రీ 2’ లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మాడాక్ ఫిల్మ్స్ ‘థామా’ మూవీని రూపొందించింది. రష్మికకు జంటగా ఆయుష్మాన్ ఖురానా నటించారు.
రష్మిక థామా సినిమా విశేషాల గూర్చి చెబుతూ ఈ సినిమా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఈ ప్రయాణంలో నవ్వులు, అలసట, కష్టాలు, గాయాలు అన్నీ ఉన్నాయి.. కానీ ఆ అనుభవం మాత్రం నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని ఉదయాలు షూట్‌కి వెళ్లాలనిపించలేదు, కానీ సెట్‌లో అడుగు పెట్టగానే అందరి ఎనర్జీ చూసి మళ్లీ జోష్ వచ్చేది” అని రష్మిక రాసుకొచ్చింది. దర్శకుడు ఆదిత్య సర్పోదర్‌పై గౌరవంతో నా హృదయం నిండిపోయింది. ఆయన నాపై నమ్మకంతో దీన్ని రూపొందించారని… సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఆయన అంకితభావం కనిపిస్తుందని ప్రశంసించారు.
సినిమా చిత్రీకరణ బృందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుందని.. వారి వల్లే మేం షూటింగ్‌ను సజావుగా చేయగలిగాం అని రష్మిక తన పోస్టులో పేర్కొన్నారు. ఎత్తైన కొండ ప్రదేశాలకు కూడా షూటింగ్ పరికరాలను మోసుకొచ్చారు. చిత్రీకరణ సమయంలో పడిన కష్టమంతా సినిమా విడుదలయ్యాక వచ్చే పాజిటివ్ కామెంట్స్‌కు మర్చిపోతాం’అని రష్మిక తన పోస్టులో తెలిపారు.
తన అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందని..వారి ప్రేమ, మద్దతు, నమ్మకం అన్నిటినీ నేను చూస్తున్నాను. మీ ప్రతి భావన నా హృదయాన్ని తాకుతుంది. అది నామనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.