విధాత : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా తెలుగు సినీ చరిత్రతో పాటు హీరో అక్కినేని నాగార్జున కెరీర్ ను సైతం మలుపు తిప్పిన ఐకానిక్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోకు 50ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈనెల 14న ఆధునిక 4కే వర్షన్ డాల్బీ అట్మాస్ సౌండ్ యాడ్ హంగులతో రీ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘శివ’ రీ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ మంగళవారం మూవీ ట్రైలర్ విడుదల చేశారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. 4కే వర్షన్ డాల్బీ సౌండ్ యాడ్ తో రూపొందించిన ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. దర్శకుడు రాజమౌళి, నాగ్ అశ్విన్ సహా ప్రముఖ దర్శకులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ వంటి హీరోల అభిప్రాయాలో మొదలైన ట్రైలర్..మూవీలోని కీలక సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగింది. సినిమాకు ఐకానిక్ సన్నివేశంగా ఉన్న చైన్ సీన్ తో ట్రైలర్ ముగించారు.
తెలుగు సినీ చరిత్రతలో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన శివ చిత్రం రీ-రిలీజ్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఓ చక్కని సాధనంగా నిలబడిందని చెప్పవచ్చు.
చైన్ ఈజ్ బ్యాక్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన “శివ” సినిమాలో నాగార్జున, అమల ప్రధాన పాత్రల్లో నటించారు. రఘువరన్ చేసిన విలన్ రోల్, నాగార్జున పెర్ఫార్మెన్స్, ఇళయరాజా సంగీతం అన్నీ కలిసి సినిమాను ఒక సూపర్ హిట్ మూవీగా నిలిపాయి. కాలేజీ నేపథ్యంలో జరిగే విద్యార్థి రాజకీయాలు, గ్యాంగ్ వార్స్ చుట్టూ సినిమా కథ సాగుతుంది. ఒక సాధారణ విద్యార్థి సమాజంలోని రాజకీయ నాయకులకు, గ్యాంగ్ వార్ కు ఎదురుతిరిగే కథనంతో సినిమా సాగుతుంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, నిజజీవితానికి దగ్గరగా ఉండి అప్పట్లో ప్రేక్షకులను ఆకర్షించాయి. హీరో నాగార్జున సైకిల్ చైన్ ఫైట్ సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. శివ చిత్రం తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించడమే కాకుండా, రామ్ గోపాల్ వర్మను దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. సాంకేతిక నాణ్యత, కెమెరా యాంగిల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ కాలానికి మించి ఉండి, కొత్త తరం దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. శివ సినిమా ప్రభావం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తరువాతి దశాబ్దాల తెలుగు సినిమాల మీద స్పష్టంగా కనిపించింది. అందుకే ఈ సినిమా ఓ మైలురాయిగా చెబుతారు. ఈ నెల 14న ఈ తరం ప్రేక్షకుల కోసం రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వారిని ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
