న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి దిశా పటానీ(Disha patani) ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. యూపీలోని బరెల్లీలోని దిశా పటాని పూర్వీకుల ఇంటిపై దుండుగులు కాల్పులు జరిపి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దిశా పటానీ ఇంటి పై 6 నుంచి 7 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ ఇంట్లో దిశా తల్లిదండ్రులు, సోదరి ఖుష్బూ పటానీలు ఉన్నారు.
గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ గ్యాంగ్(Goldy Brar Gang) ఈ కాల్పులు ఘటనకు పాల్పడినట్లుగా ప్రకటించుకుంది. ఆధ్యాత్మిక గురువులు ప్రేమానంద్ మహారాజ్(Premanand Maharaj), అనిరుద్ ఆచార్య(Aniruddhacharya) పై దిశా పటాని సోదరి ఖుష్బూ పటానీ(Khushboo Patani) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తాము ఈ దాడికి పాల్పడ్డామని..ఇది ట్రైలర్ మాత్రమేనంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ సభ్యులు విరేంద్ర చారణ్, మహేంద్ర సరణ్ ప్రకటించారు. ఆధ్యాత్మిక గురువులను, సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని ఆ గ్యాంగ్ తీవ్రంగా హెచ్చరించింది. భవిష్యత్తులో మన మతం, సాధువులకు వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి అవమానకరమైన చర్యకు పాల్పడితే.. దాని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మన మతాన్ని రక్షించుకోవడానికి మేము ఎంతకైనా తెగిస్తాం. మేము అస్సలు వెనక్కి తగ్గం. మా మతం, సమాజంను రక్షించడమే మా ప్రథమ కర్తవ్యం’ అని సోషల్ మీడియాలో పోస్టులో హెచ్చరించారు. కాగా కాల్పుల ఘటనకు పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టాయి.