Disha Patani House Firing Case | బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బరేలీలోని ఆమె పూర్వీకుల ఇంటి వద్ద సెప్టెంబర్ 12న కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు, బుధవారం ఘజియాబాద్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. వీరిని పోలీసులు గోల్డీ బ్రార్–రోహిత్ గోదారా గ్యాంగ్‌కు చెందినవారిగా గుర్తించారు.
పటానీ ఇంటిపై దాడి ఎలా జరిగింది?
సెప్టెంబర్ 12 తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బరేలీ సివిల్ లైన్స్‌లోని దిశా పటానీ(Disha Patani) పూర్వీకుల ఇంటి వద్ద ఇద్దరు దుండగులు మోటార్‌సైకిల్‌పై వచ్చి ఇంటిపైకి ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఇంట్లో దిశా తండ్రి జగదీశ్ పటానీ (రిటైర్డ్ డీఎస్పీ), తల్లి పద్మ, అక్క ఖుష్బూ పటానీ (రిటైర్డ్ ఆర్మీ మేజర్), తమ్ముడు సూర్యాంశ్ ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు.
కాల్పుల తర్వాత కెనడాలో నివాసం ఉంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ (Goldy Brar) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు సోషల్ మీడియాలో తెలిపాడు. అతని పోస్ట్‌లో దిశా, ఆమె అక్క ఇద్దరూ కొందరు మత గురువులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో హెచ్చరికగా కాల్పులు జరిపించానని ప్రకటించాడు.
ఈ సంఘటన తర్వాత CM యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)స్వయంగా దిశా తండ్రిని ఫోన్ చేసి వారి భద్రతపై హామీ ఇచ్చారు. నిందితులను తప్పకుండా పట్టుకుంటామని మాటిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశంతో పటానీ ఇంటి వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
కాల్పుల తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, మోటార్‌సైకిల్ నంబర్ ఆధారంగా దుండగులను ట్రాక్ చేశారు. ప్రధాన నిందితులు రవీంద్ర అలియాస్ కులు (రోహ్తక్), అరుణ్ (సోనిపట్), గోల్డీ బ్రార్–రోహిత్ గోదారా గ్యాంగ్‌లో సభ్యులని అని గుర్తించారు. బుధవారం ఉదయం ఘజియాబాద్‌లోని ట్రానికా సిటీలో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(UP STF), ఢిల్లీ పోలీస్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్, హర్యానా STF సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. పోలీసుల కదలికలు గుర్తించగానే దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరపగా, రవీంద్ర, అరుణ్ ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
సంఘటనా స్థలం నుంచి గ్లోక్ పిస్టల్, జిగానా పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ప్రస్తుతం గ్యాంగ్‌లోని ఇతర సభ్యుల కోసం గాలింపు చేపట్టారు.
దిశా పటానీ ఇంటిపై కాల్పుల కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితులు హతమవ్వడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్ జరగడం కొసమెరుపు.