విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. నందినగర్ నివాసంలోనే ఈ నోటీసులు అందచేశారు. ఫిబ్రవరి 1 ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ కేసీఆర్ కు నోటీసులో స్పష్టం చేసింది.
అంతకుముందు సిట్ తొలి నోటీసులకు జవాబుగా తాను మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నానని, శుక్రవారం విచారణకు రాలేనంటూ కేసీఆర్ సిట్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించాలని కోరారు. ఇకముందు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఫామ్ హౌస్ కే పంపించాలని కేసీఆర్ లేఖలో చేసిన విజ్ఞప్తిని తాజాగా సిట్ నిరాకరించింది. కేసీఆర్ శుక్రవారం తన ఫామ్ హౌస్ లో కారులో తిరుగుతూ పంట పొలాలను పరిశీలించారు. ఫామ్ హౌస్ కు వచ్చిన కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో మున్సిపల్ ఎన్నికలపై చర్చించి ఎన్నికల వ్యూహాలపై వారికి మార్గదర్శకం చేశారు. సాయంత్రం కల్లా సిట్ కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. సిట్ తాజా నోటీసులపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరం.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరెస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
