విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో గేమ ఛేంజర్ గా భావిస్తున్న రీజినల్ రింగ్ రైల్ (RRR) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు , సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేసేందుకు కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి తాజాగా లేఖ కూడా రాశారు.
ప్రస్తుతం రీజినల్ రింగ్ రైల్వే లైన్ అలైన్‌మెంట్‌ను రీజినల్ రింగ్ రోడ్ (RRR) వెంబడి ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలుకు కచ్చితమైన టైమ్ లైన్ ఇప్పుడే చెప్పలేమని అంతకంటే ముందు డీపీఆర్ సిద్ధం చేసేందుకు అవసరమైన సర్వేకు అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక శాఖల ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకెలుతామని కేంద్రం వెల్లడించింది. ఆర్థిక లభ్యత, సాంకేతిక సవాళ్లు , భూసేకరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపైనే ప్రాజెక్ట్ గడువు ఆధారపడి ఉంటుందని రైల్వే శాఖ వివరించింది.
సీఎం రేవంత్ రెడ్డి రీజినల్ రింగ్ రైల్వే లైన్ పై ఇప్పటికే కేంద్రంతో పలు దఫాలుగా చర్చించారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న జిల్లాలను అనుసంధానిస్తూ సాగే ఈ రైలు మార్గం సాకారమైన పక్షంలో భవిష్యత్తులో శివారు ప్రాంతాల అభివృద్ధికి , రవాణా వసతులలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
జర్నలిస్టు సంక్షేమానికి స్టాలిన్ సర్కార్ కీలక ఆదేశాలు
కోకాపేటకు మించి హయత్ నగర్ వైపు అభివృద్ది : మంత్రి వెంకట్ రెడ్డి
