ఏపీలో ఉద్యోగుల అల్టిమేటమ్!..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ !!

ఏపీలో పీఆర్సీ, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

విధాత : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వేసవి ఎండల కంటే అధికంగా సమ్మెల సెగలు హీట్ పెంచుతున్నాయి. ఉగాది నాటికి పీఆర్సీ(PRC), ఐఆర్(IR)పై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ ఎంఫ్లాయిస్ ఫెడరేషణ్(APGEF) అల్టిమేటమ్ ఇవ్వడం కలకలం రేపింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వాల్సిన నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయని, ఇన్ని డిఏలు ఏ రాష్ట్రంలో పెండింగ్ లో లేవని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటికే చాలా నష్టపోయామని, చాలా భరించామని, వెంటనే పీఆర్సీ , ఐఆర్ లపై ప్రకటన చేయాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరింది. లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని పాతిక లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలతో భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ ?

లంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ) కార్మికులు సమ్మెకు సిద్దమైనట్లుగా సమాచారం. ఆర్టీసీ ఎండీకి ఇప్పటికే సమ్మె నోటీస్ సైతం అందించారు. సమ్మె చేపడితే తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రతిపక్షాలు సైతం ప్రకటించడం గమనార్హం. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మె తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డిలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, కొత్త డిమాండ్లను పెట్టడం లేదని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. 2021 వేతన సవరణ 30శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి. అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఎరియర్స్‌ను మాత్రం ఇంకా చెల్లించలేదని, ఆర్టీసీకి రావాల్సిన రూ. 2,500 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని కోరారు. అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఆర్టీసీ డిపోలు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. 14 రోజుల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని వారు హెచ్చరించారు. తమ పెండింగ్‌ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. మరి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రకటన చేస్తుందా? లేక కార్మికులు సమ్మె బాటలో సాగిపోతారా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

కిమ్ మామా అలజడి: నార్త్ కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం
దారుణం..పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్!

Latest News