దారుణం..పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్!
పెళ్లికి నిరాకరించిన యువతిపై ప్రతీకారంగా ఎయిడ్స్ రక్తంతో ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విధాత : పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ రక్తం ఇంజక్షన్ ఎక్కించిన యువకుడి దుర్మార్గం సంచలనం రేపింది. యువతిపై పగ తీర్చుకునేందుకు యువకుడు ఇటీవల విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ తెలుగు సినిమా తరహాలో ఎయిడ్స్ ఇంజక్షన్ ప్రయోగించడం గమనార్హం. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో.. అన్నోజిగూడకు చెందిన మనోహర్ అనే యువకుడు కొంతకాలంగా తన మేనమరదలిని ప్రేమిస్తున్నాడు. ఇటీవలే ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ రగిలిపోయాడు. తనను కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయాడు.
ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలని మనోహర్ ఒత్తిడి చేశారు. అయితే మనోహర్ కు ఎయిడ్స్ ఉందన్న కారణంతో యువతి అతనితో పెళ్లికి నిరాకరించింది. దీంతో యువతిపై ప్రతీకారం పెంచుకున్న మనోహర్ ఎయిడ్స్ రక్తంతో నింపిన ఇంజెక్షన్ ను బలవంతంగా ఆ యువతికి ఇచ్చి పగ తీర్చుకున్నాడు.
ఓ వైపు పెళ్లి దగ్గర పడుతున్న వేళ కొద్ది రోజులుగా ఆ యువతి తీవ్ర జ్వరంతో బాధపడటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. రిపోర్టులు చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆ యువతికి హెచ్ఐవీ (HIV) పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పెళ్లికి ముందు ఆరోగ్యంగా ఉన్న తన కూతురికి ఇలా ఎయిడ్స్ బారిన పడటం వెనుక మనోహర్ చేసిన కుట్ర ఉందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మనోహర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా..అతని దుర్మార్గం బయటపడినట్లుగా సమాచారం. దీంతో మహిళా సంఘాలు, బాధిత యువతి బంధువులు అంతా మనోహర్ ను కఠినంగా శిక్షించి యువతిని రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
LPG Booking Complaints | గ్యాస్ సిలిండర్ అందలేదా ?..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
Groom Arrest | తాళి కట్టే వేళ వరుడు అరెస్ట్.. కన్నీరు పెట్టుకున్న నవ వధువు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram