TG-FSL Fire Accident | “ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల సాక్ష్యాలు సురక్షితం”

హైదరాబాద్‌లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాలు సురక్షితంగానే ఉన్నాయని FSL స్పష్టం చేసింది. డేటా రికవరీ, పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

Fire incident at Telangana Forensic Science Laboratory in Hyderabad, affecting computer lab and office rooms, Director clarifies

Note for Vote, Phone Tapping Evidence Remains Intact: FSL Assurance

సారాంశం

హైదరాబాద్‌లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో, ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’   కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని FSL అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా వస్తువులు కోర్టులకు అప్పగించగా, మిగిలినవి ప్రత్యేక భద్రతలో ఉన్నాయి. డేటా రికవరీ ప్రక్రియ కొనసాగుతుండగా, పోలీసు విచారణ అన్ని కోణాల్లో సాగుతోంది.

విధాత క్రైమ్​ బ్యూరో | 8 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్​:

TG-FSL Fire Accident | ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి హైప్రొఫైల్ కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాలు సురక్షితంగానే ఉన్నాయని తెలంగాణ ఫోరెన్సిక్​ సైన్స్​ లాబొరేటరీ (FSL) స్పష్టం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో, హైప్రొఫైల్ కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.  ఈ నేపథ్యంలో FSL కీలక ప్రకటన చేస్తూ, అన్ని ప్రధాన కేసులకు సంబంధించిన వస్తువులు పూర్తిగా సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.

“ఓటుకు నోటు” కేసుపై వివరాలు

FSL డైరెక్టర్ శిఖా గోయల్​ ఆదివారం మాట్లాడుతూ, నోట్ ఫర్ ఓట్ కేసుకు సంబంధించి 2015లో ఏసీబీ నుంచి 16 భౌతిక సాక్ష్యాలు అందాయనీ, వాటిపై శాస్త్రీయ పరీక్షలు పూర్తయ్యాయని, సంబంధించిన నివేదికలు సహా అన్ని వస్తువులు 2021లోనే కోర్టుకు తిరిగి అప్పగించామని, ప్రస్తుతం FSL వద్ద ఆ కేసుకు సంబంధించిన ఏ సాక్ష్యమూ తమవద్ద లేదని స్పష్టం చేశారు.

ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి  పేరు ప్రముఖంగా ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

“ఫోన్ ట్యాపింగ్” కేసు సాక్ష్యాల స్థితి

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 2024 నుంచి 2026 జనవరి వరకు మొత్తం 136 వస్తువులు FSLకు అందాయని అధికారులు తెలిపారు. వాటిలో 7 మినహా మిగిలినవన్నీ ఇప్పటికే సంబంధిత అధికారులకు అప్పగించామని, మిగిలిన 7 వస్తువులను సురక్షితంగా భద్రపరిచి గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అగ్ని ప్రమాదం – నష్టం, పునరుద్ధరణ

కాగా, FSL భవనంలో ఉదయం 10.08 గంటలకు మంటలు చెలరేగాయని, కార్యాలయ ఉద్యోగి సాయి గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారని డైరెక్టర్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది 1.30 గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు.

ఈ ప్రమాదంలో.. కంప్యూటర్ ల్యాబ్, సంబంధిత గదులు, సమావేశ మందిరం, గ్రంథాలయాలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే, మిగతా విభాగాలు యథావిధిగా పనిచేస్తున్నాయని తెలిపారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో  హార్డ్‌డిస్క్‌లు, సర్వర్ల నుంచి సమాచారం రికవరీ ప్రక్రియ కొనసాగుతోందని, దశలవారీగా బ్యాకప్ పునరుద్ధరణ కూడా మొదలైందని , మొత్తం సమాచారాన్ని తిరిగి పొందగలమన్న నమ్మకం ఉందని శిఖా గోయల్​ వెల్లడించారు.

పోలీసు విచారణ కొనసాగింపు

ఈ ఘటనపై నాంపల్లి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను పోలీసులు, అగ్నిమాపక శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేసి వెల్లడిస్తాయని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ FSLలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో నెలకొన్న సందేహాలకు ముగింపు పలుకుతూ, కీలక కేసులకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు పూర్తిగా సురక్షితంగానే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. నోట్ ఫర్ ఓట్, ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన కేసుల్లో న్యాయ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగదని ఈ ప్రకటనతో స్పష్టమైంది.

Latest News