Sivakarthikeyan | తమిళ హీరో శివ కార్తీకేయన్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన మొదట తమిళ టీవీ ఛానల్ ఐన విజయ్ టీవీలో వ్యాఖ్యాతగా పని చేశారు. ఆ తర్వాత దర్శకుడు పాండియరాజన్ చిత్రం ‘మెరీనా’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అమరన్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీపావళి కానుగా ఈ నెల 31న థియేటర్లలోకి విడుదల కాబోతున్నది. ఇక మూవీలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తున్నది. సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది న్యాచురల్ బ్యూటీ.
తెలంగాణ యాసతో ‘ఫిదా’ మూవీతో అందరినీ ఆకట్టుకున్నది. సాయిపల్లవి, శివ కార్తీకేయన్ జంటగా నటించిన ‘అమరన్’ మూవీ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియార్‌స్వామి. ఇటీవల చిత్రం ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఫన్నీ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఓ ఛానెల్‌లో పని చేస్తున్న సమయంలో సాయిపల్లవిని తొలిసారి కలిశానని తెలిపారు. ‘ప్రేమమ్’ మూవీలో నటనను చూసి ఆశ్చర్యపోయానని.. ఫోన్ చేసి అభినందించారట. అయితే, సాయిపల్లవి వెంటనే ‘థాంక్యూ అన్నా’ అనేసిందంట. ఆ మాటలు వినగానే గుండె జారిపోయినట్లుగా అనిపించిందంటూ శివకార్తీకేయన్ తనకు కలిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
హీరోయిన్ సాయిపల్లవితో పాటు అక్కడున్న వారంతా తెగనవ్వేశారు. సినిమా గురించి మాట్లాడుతూ మేజర్ ముకుంద్ వరద రాజన్ గుర్తించి వార్తల్లో విన్నానన్నారు. రాజ్‌కుమార్ కథను చెప్పిన సమయంలో ఎమోషనల్ అయ్యానని చెప్పారు. కశ్మీర్‌లో వందరోజుల పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించామన్నారు. రాత్రి సమయంలో షూటింగ్ జరిగేదని.. ఆ సమయంలో చలి ఎక్కువగా ఉండేదన్నారు. చిత్రం క్లైమాక్స్ అందరినీ కంటతడి పెట్టిస్తుందన్నారు. మేజర్ ముకుంద్ అందమైన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని ఈ మూవీ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుందన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ మేజర్ పాత్రలో శివకార్తీకేయన్ ఒదిగిపోయారన్నారు. భవిష్యత్తులో ఆయనో కలిసి పని చేయాలనుకుంటున్నానన్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.