విధాత, హైదరాబాద్ : యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవార్డ్స్–2025కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవార్డు ఫంక్షన్ నిర్వహణ ఖర్చు కోసం రూ. 30 లక్షల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. అవార్డు ఫంక్షన్ నిర్వహణ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేశారు. అవార్డుల పునర్వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్ గా దర్శకుడు దశరథ్ నియామితులయ్యారు. కమిటీకి కన్వీనర్ గా టీజీఎఫ్ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను నియమించారు. సభ్యులుగా దర్శకుడు హరీష్ శంకర్, కళాకారుడు బలగం వేణు, పి.జి.వినోద్, రాహుల్ సిప్లిగంజ్, చరణ్ అర్జున్, లక్ష్మీ లను నియమించారు. టీజీఎఫ్ డీసీఎల్ ద్వారా అవార్డుల కార్యక్రమం నిర్వహణ జరుగనుంది.
డిసెంబర్ లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను డిసెంబర్ 19నుంచి 21వరకు టీజీఎఫ్ డీసీఎల్, దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఫెస్టివల్ నిర్వహణకు సైతం రూ. 30లక్షలు విడుదల చేసింది.
2024 టీవీ అవార్డ్సు కమిటీ ప్రకటన
టెలివిజన్ అవార్డ్స్ -2024 కు సంబంధించి మార్గదర్శకాలు, లోగో రూపకల్పన, అవార్డుల పంపిణీల కోసం ప్రభుత్వం కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా మరార్ శరత్ ను, కన్వీనర్ గా టీజీఎఫ్ డీసీఎల్ ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ ను నియమించింది. మొత్తం 15మందితో కమిటీ ఏర్పాటు చేసింది.
