విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి, పి. సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం సుదర్శన్ రెడ్డికి సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఛాంబర్ కేటాయించింది. తన ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రి పదవిని ఆశించిన సుదర్శన్ రెడ్డికి వివిధ సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం సూచనల మేరకు ఆయనను బుజ్జగించి కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. అలాగే కేబినెట్ బెర్త్ కోరుకున్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కూడా కేబినెట్ హోదాతో రాష్ట్ర సివిల్ సఫ్లయ్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం జరిగింది. తాజాగా మహ్మాద్ అజారుద్ధీన్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఎం సహా మంత్రివర్గం సంఖ్య 16కు చేరింది. కేబినెట్ లో మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, నేనావత్ బాలు నాయక్, రామ్మోహన్ రావు లు రేసులో ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మునముందు మరోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తారా లేక ప్రక్షాళన చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
