Tharun bhascker | టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అల్లు శిరీష్ కూడా నయనిక రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో మరో జంట పేరు కూడా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మరియు హీరోయిన్ ఈషా రెబ్బా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరుణ్ భాస్కర్ మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాలతో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందనే వార్తలు మరింతగా చర్చకు వచ్చాయి. ఇప్పటికే చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో కొనసాగుతోంది.
సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈషా రెబ్బాను డేటింగ్ గురించి ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా స్పందించారు. “వార్తల్లో ఉండటం కూడా ఒక విధంగా మంచిదే. ప్రస్తుతానికి దేనిపైనా క్లారిటీ ఇవ్వను. నా జీవితంలో ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేనే స్వయంగా చెబుతాను” అని చెప్పింది. మరోవైపు తరుణ్ భాస్కర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈషా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆమె నాకు ఒక స్నేహితురాలి కంటే ఎక్కువ. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందరి ముందు ధైర్యంగా ప్రకటిస్తాను” అని చెప్పారు. అలాగే “అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే మంచి వార్త చెబుతాను” అని చెప్పడం పెళ్లి వార్తలకు మరింత ఊపునిచ్చింది.
ఇటీవల జరిగిన కొన్ని సినీ కార్యక్రమాలు, పెళ్లి వేడుకల్లో కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం మరింత బలపడింది. అయితే ఈ విషయంకి సంబంధించి మరో చర్చ కూడా నడుస్తుంది. తరుణ్ భాస్కర్ గతంలో లతా నాయుడు అనే యువతిని వివాహం చేసుకున్నారు. కొంతకాలం అన్యోన్యంగా జీవించిన ఈ జంట తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చట్టపరంగా విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం.
విడాకుల ప్రక్రియ పూర్తైన తర్వాతే తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా వివాహం జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ ఇద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ జంట గురించి వస్తున్న వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
