Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, పాటలు, ప్రచార కంటెంట్‌కు లభించిన స్పందనతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్లలో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉంది.

ఈ సందర్భంగా సమంత వెల్లడించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో హీరోయిన్‌గా మొదట తనను కాకుండా న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవిని అనుకున్నట్లు సమంత స్వయంగా వెల్లడించారు.

డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల‌న‌…

సమంత మాట్లాడుతూ.. “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌ను ప్రారంభించినప్పుడు మహిళా ప్రధాన కథలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. ఆ క్రమంలోనే ‘మా ఇంటి బంగారం’ కథను ముందుగా సాయిపల్లవికి వినిపించి, ఆమెతో ఈ సినిమా చేయాలని భావించాం. ఆమె నటనకు నేను పెద్ద అభిమానిని. నా నిర్మాణ సంస్థలో ఆమె హీరోయిన్‌గా నటిస్తే బాగుంటుందని అనుకున్నాను” అని తెలిపారు.

అయితే అప్పట్లో సాయిపల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదని, దాంతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదని సమంత చెప్పారు. “కథను పూర్తిగా పక్కన పెట్టకుండా, నాకు సరిపోయేలా కొన్ని మార్పులు చేసి నేనే నటించాలని నిర్ణయించుకున్నాం. నిజానికి నేను ఈ సినిమాను ఎంచుకోలేదు.. ఈ సినిమానే నన్ను ఎంచుకుంది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాయి ప‌ల్ల‌వి విషెస్..

ఇక సమంత వ్యాఖ్యలకు స్పందించిన సాయిపల్లవి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేస్తూ.. “ఈ సినిమా సమంత చేయాల్సిందే. అది ఆమె కోసం రాసి పెట్టినట్టే ఉంది. దర్శకురాలు నందినీ రెడ్డి, సమంతకు నా బెస్ట్ విషెస్. ప్రేమతో హగ్స్ పంపిస్తున్నా” అని పేర్కొన్నారు.

ఈ పరస్పర గౌరవం, అభిమానంతో కూడిన సందేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకరిపై ఒకరు చూపిన ఆదరణ సినీ వర్గాల్లో కూడా ప్రశంసలు అందుకుంటోంది.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా, శ్రీముఖి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

సమంత చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.