Vijay Devarakonda | టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న స్టార్ కపుల్స్‌లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట ముందుంటుంది. వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వివాహం అనంతరం కూడా ఈ జంట ఎక్కడ కనిపించినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కపుల్ వార్తల్లో నిలిచింది.
తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి కనిపించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించింది విజయ్ దేవరకొండ మెడలో కనిపించిన ప్రత్యేకమైన చైన్, దానిపై ఉన్న ‘R’ అక్షర పెండెంట్. ఈ పెండెంట్ చూసిన అభిమానులు, నెటిజన్లు వెంటనే రష్మిక మందన్న పేరును గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ మంగళసూత్రం..
విజయ్ తన భార్య రష్మికపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికే ‘R’ అక్షరంతో ఉన్న పెండెంట్ ధరించాడని అభిమానులు భావిస్తున్నారు. సాధారణంగా భార్యలు భర్త పేరుతో ఆభరణాలు ధరించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ విజయ్ మాత్రం భార్య పేరులోని మొదటి అక్షరాన్ని మెడలో ధరించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. కొందరు నెటిజన్లు సరదాగా దీనిని “విజయ్ దేవరకొండ మంగళసూత్రం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. విజయ్ – రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘రణబాలి’. ఈ సినిమా టైటిల్ కూడా ‘R’ అక్షరంతో ప్రారంభం కావడంతో.. ఈ పెండెంట్ వెనుక సినిమా ప్రమోషన్ కోణం కూడా ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రేమను, ఇటు సినిమా హైప్‌ను ఒకే స్టైల్‌లో మేనేజ్ చేస్తున్నాడంటూ విజయ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రణబాలిపై ఆసక్తి..
వివాహం తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’ కావడం ప్రత్యేకతగా మారింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా 1854 నుంచి 1878 మధ్య జరిగిన కొన్ని చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. చరిత్ర పుస్తకాలలో మరుగునపడ్డ కొన్ని వాస్తవాలను ఈ సినిమాలో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయ్ – రష్మిక జంట మరోసారి వెండితెరపై కనిపించబోతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘R’ పెండెంట్ వెనుక అసలు కథ ఏంటన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. నిజంగా అది రష్మిక కోసమేనా? లేక ‘రణబాలి’ ప్రమోషన్‌లో భాగమా? అన్నది తెలియాలంటే విజయ్ లేదా రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.