Tollywood | ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లి వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్లు ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగుపెడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వార్తలు చర్చనీయాంశంగా మారగా, తాజాగా నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో మరో టాలీవుడ్ హీరో పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ హీరో మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తండ్రి నిర్మాత కావడంతో సినీ పరిశ్రమలోకి ఆయన ప్రవేశం చాలా సులభమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాతో ఆయన హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించగా, తమన్నా ప్రత్యేక పాటలో కనిపించడం విశేషం. తొలి సినిమాకే మంచి ఓపెనింగ్స్ రావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగించారు.
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు, హైందవ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇక ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా గతంలో పలు గాసిప్స్ వినిపించాయి. కొంతమంది హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అవి నిజం కాలేదు. తాజాగా మాత్రం ఆయన పెళ్లి గురించి కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెబుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది.
కొన్ని వార్తల ప్రకారం ఆయన పెళ్లి చేసుకోబోయే యువతి పేరు కావ్య రెడ్డి అని తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన కుటుంబానికి చెందినదని సమాచారం. ఆమె కుటుంబానికి సినిమా రంగంతో సంబంధం లేదని, న్యాయవాద రంగానికి చెందిన కుటుంబమని చెబుతున్నారు. ఆమె తండ్రి లాయర్ కాగా, ఆమె తాతగారు జడ్జిగా పనిచేసినట్లు కూడా సమాచారం. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డిలకు ముందే పరిచయం ఉందని, ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం కూడా జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
అయితే ఈ విషయంపై బెల్లంకొండ కుటుంబం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
