Flower Farming | 18 ఏళ్ల‌కే పూల వ్యాపారం.. ఏడాదికి రూ. 70 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తున్న‌ తెలంగాణ బిడ్డ‌

Flower Farming | కేవ‌లం చదువు, ఉద్యోగంతోనే డ‌బ్బులు సంపాదించొచ్చు అనుకుంటారు. కానీ అది త‌ప్పు. చ‌దువులో రాణించ‌లేక‌పోయినా.. తెలివితేట‌లు ఉంటే చాలు.. కోట్ల రూపాయాలు సంపాదించొచ్చు. అందుకు ఈ తెలంగాణ( Telangana ) బిడ్డ జీవిత‌మే ఆద‌ర్శం. ప‌దో త‌ర‌గ‌తి ఫెయిలైన ఈయ‌న‌.. ఇప్పుడు ఏడాదికి రూ. 70 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తూ.. ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలిచాడు. మ‌రి అత‌ని స‌క్సెస్ గురించి తెలుసుకుందాం.

Flower Farming | నిజామాబాద్ జిల్లా బోధ‌న్‌కు చెందిన బొల్ల‌ప‌ల్లి శ్రీకాంత్( Bollapally Srikanth ).. రైతు కుటుంబంలో జ‌న్మించాడు. చిన్న‌ప్ప‌ట్నుంచే క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అప్పుల కార‌ణంగా చ‌దువు పెద్ద‌గా చ‌ద‌వ‌లేదు. ప‌దో త‌ర‌గ‌తిలో ఫెయిల‌య్యాడు. 16 ఏళ్ల వ‌య‌సులో ఇంటి బాధ్య‌త‌ల‌న్నీ త‌న మీద వేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం బెంగ‌ళూరు( Bengaluru ) న‌గ‌రం బ‌య‌ల్దేరాడు. బెంగ‌ళూరు ప‌రిస‌రాల్లోని నెల‌మంగ‌ళ‌లోని పూల తోట‌ల్లో కూలీ ప‌నికి కుదిరాడు. నెల‌కు రూ. 1000 చొప్పున జీతం ఇచ్చేవారు. ఈ వెయ్యి కోసం ప్ర‌తి రోజు 18 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డేవాడు శ్రీకాంత్.

సీన్ క‌ట్ చేస్తే.. రెండేళ్ల పాటు నిర్విరామంగా క‌ష్ట‌ప‌డిన శ్రీకాంత్‌.. పూల వ్యాపారంలో ఉన్న మెళ‌కువ‌ల‌ను ఒంట ప‌ట్టించుకున్నాడు. ఇక 1997లో త‌న 18వ ఏట పూల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కేవలం రూ. 20,000 పెట్టుబడితో ఒక చిన్న పూల దుకాణాన్ని బెంగ‌ళూరులో ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించిన తొలి ఏడాదికి శ్రీకాంత్‌కు రూ. 5 ల‌క్షల ట‌ర్నోవ‌ర్ వ‌చ్చింది. దాంతో అక్క‌డ్నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. 25 ఏళ్ల వ‌య‌సు నాటికి త‌న వ్యాపారం రూ. 5 కోట్ల మార్కు చేరుకుంది.

వ్యాపారం నుంచి సాగువైపు అడుగులు

త‌న వ్యాపారం రూ. 5 కోట్ల మార్కు దాటిన త‌ర్వాత‌.. తానే స్వ‌యంగా పూల‌ను పండించాల‌ని శ్రీకాంత్ నిర్ణ‌యించుకున్నాడు. ఇందుకు బెంగ‌ళూరు శివార్ల‌లో భూమిని కొనుగోలు చేసి వెన్సాయ్ ఫ్లోరిటెక్ సంస్థ‌కు పురుడుపోశాడు. ఐదారు ఎక‌రాల‌తో ప్రారంభ‌మైన పూల‌సాగు ఇప్పుడు 70 ఎక‌రాల‌కు విస్త‌రించింది. అత్యాధునిక టెక్నాల‌జీతో.. గులాబీలు, జెర్బెరా, కార్నేష‌న్ వంటి 20 ర‌కాల పూల‌ను సాగు చేస్తున్నాడు. త‌న కుమార్తె పేరు మీద మోక్ష‌శ్రీ అనే స‌రికొత్త జెర్బెరా ర‌కాన్ని కూడా శ్రీకాంత్ సృష్టించాడు.

హైటెక్ ప‌ద్ధ‌తుల్లో పూల సాగు..

అయితే శ్రీకాంత్ పూల సాగు విష‌యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. సాంప్ర‌దాయ వ్య‌వ‌సాయానికి భిగన్నంగా హైటెక్ ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించాడు. పాలీహౌస్‌లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌక‌ర్యాల‌ను వినియోగించి పూల‌ను సాగు చేస్తున్నాడు. ఇలా పండించిన పూల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కే కాకుండా.. దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల‌కు శ్రీకాంత్ పూల‌ను ఎగుమ‌తి చేస్తూ ఏడాదికి రూ. 70 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తున్నాడు.

శ్రీకాంత్ ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం..

ఏది ఏమైనా.. జీరోతో మొదలుపెట్టిన శ్రీకాంత్ గారు కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎదగడం నిజంగా స్ఫూర్తి దాయకం. తను వ్యాపారం చేస్తూ.. ఇతర రైతులకు కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఏ డిగ్రీ లేకపోయినా కృషితో కోట్లు సంపాదించవచ్చని నిరూపించిన ఈ తెలంగాణ బిడ్డ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆద‌ర్శం.

Latest News