Bengaluru-Vijayawada | చరిత్ర సృష్టించిన బెంగళూరు-విజయవాడ కారిడార్.. వారంలోనే నాలుగు గిన్నిస్ రికార్డులు!

Bengaluru-Vijayawada | దేశ రహదారి నిర్మాణంలో బెంగళూరు-విజయవాడ కారిడార్ ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒకే వారంలో నాలుగు గిన్నిస్ రికార్డులను సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. రహదారులను ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా నిర్మించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పింది.

Bengaluru-Vijayawada | చరిత్ర సృష్టించిన బెంగళూరు-విజయవాడ కారిడార్.. వారంలోనే నాలుగు గిన్నిస్ రికార్డులు!

Bengaluru-Vijayawada | దేశ రహదారి నిర్మాణంలో బెంగళూరు-విజయవాడ కారిడార్ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. రాయలసీమ నుంచి ఐటీ నగరాలకు వరకూ కనెక్టివిటీ పెంచే ఈ ప్రాజెక్టు దేశ నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఒకే వారంలో నాలుగు గిన్నిస్ రికార్డులను సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. రహదారులను ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా నిర్మించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పింది. జనవరిలో ప్రారంభమై శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు నగరాల మధ్య రహదారి సమస్య

దేశంలోనే ఐటీకి ప్రధాన కేంద్రమైన బెంగళూరు, ఏపీలో కీలక వాణిజ్య కేంద్రమైన విజయవాడ మధ్య దూరం సుమారు 635 కిలోమీటర్లు అయినప్పటికీ.. ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. మధ్యలో ఉన్న పట్టణాలు, మలుపులు తిరిగే రోడ్లు, సరైన ఎక్స్‌ప్రెస్ వే లేకపోవడం వల్ల ఈ రెండు సిటీల మధ్య ప్రయాణం కష్టసాధ్యంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికే బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్ (NH-544G)ను చేపట్టారు.

ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతో సమస్యకు చెక్

భారతమాల పథకం కింద బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 518 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాన్ని చేపట్టారు. ఈ హైవేపై ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. గ్రామాలు వచ్చిన దగ్గర మెల్లగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడా ఆగకుండా చాలా వేగంగా, సాఫీగా ప్రయాణించవచ్చు. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చాలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తుండటం గమనార్హం.

రాయలసీమకు జీవనాడి

ఈ కారిడార్ కేవలం విజయవాడ, బెంగళూరు నగరాలను మాత్రమే కలపదు. రాయలసీమలోని కడప, కర్నూలు వంటి జిల్లాల గుండా వెళ్తూ ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుంది. పల్లీలు, మిల్లెట్స్, ఉద్యానవన పంటల ఉత్పత్తిలో ముందున్న ఈ ప్రాంతాలకు వ్యవసాయ మార్కెట్లు, లాజిస్టిక్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో దోహదపడుతుంది. అంటే ఒకరకంగా తక్కువ కనెక్టివిటీ ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఈ రహదారి ఒక జీవనాడిగా చెప్పొచ్చు.

100 కిలోమీటర్లు.. 4 గంటల ప్రయాణం సేఫ్

ఈ కారిడార్‌లో 343 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, 17 ఇంటర్‌చేంజ్‌లు, 10 వే సైడ్ సౌకర్యాలు, 5.3 కిలోమీటర్ల టన్నెల్‌లు ఉన్నాయి. సుమారు 21 కిలోమీటర్ల అటవీ ప్రాంతం నుంచి ఈ రహదారి వెళ్లనుంది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే బెంగళూరు-విజయవాడ మధ్య దూరం 635కిలోమీటర్ల నుంచి 535కిలోమీటర్లకు తగ్గుతుంది. రద్దీగా ఉండే పట్టణాలు, వంకర రహదారులు లేకుండా సిగ్నల్ ఫ్రీ ఎక్స్‌ప్రెస్ వే ఉండటంతో ప్రయాణ సమయం కూడా 12 గంటల నుంచి సుమారు 8 గంటలకు తగ్గుతుంది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే బెంగళూరులోని ఐటీ పరిశ్రమలను ఏపీలోని తీర ప్రాంతాలకు అనుసంధానిస్తూ ఆర్థిక అభివృద్ధి సాధించడంలో దోహదపడనుంది. ముఖ్యంగా ట్రక్కులు నడిపే డ్రైవర్లు, సరకు రవాణా చేసే వ్యాపారులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుంది.

పుట్టపర్తిలో కారిడార్ నిర్మాణం ప్రారంభం

బెంగళూరు-విజయవాడ మధ్య ఈ కారిడార్‌ నిర్మాణాన్ని 2026 జనవరిలో చేపట్టారు. భారత జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI), రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేటు లిమిటెడ్ కలిసి ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టాయి. ప్రపంచంలో ఎప్పుడూ లేనంత వేగంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే పుట్టపర్తి సమీపంలో అత్యంత వేగంగా రహదారి నిర్మాణం చేపట్టి ప్రపంచ రికార్డులను సృష్టించాయి.

ఒకే రోజులో రెండు ప్రపంచ రికార్డులు

ముందుగా ఈ ఏడాది జనవరి 6వ తేదీన 24 గంటల్లో 9.63 కిలోమీటర్ల పొడవైన మూడు లేన్ల ( మొత్తంగా 28.89 లేన్ కిలోమీటర్ల ) బిటుమినస్ కాంక్రీట్ రహదారి నిర్మాణం చేపట్టి తొలి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అదే సమయంలో 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను వినియోగించి రెండో రికార్డు నెలకొల్పారు. ఈ పరిమాణం దాదాపు 1400 ఏనుగుల బరువుతో సమానం. ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో నిర్మాణం జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ రికార్డు కోసం 600 మందికిపైగా ఇంజినీర్లు, కార్మికులు నిరంతరం పనిచేశారు. 70 టిప్పర్లు, 5 హాట్ మిక్స్ ప్లాంట్లు, ఒక పేవర్, 17 రోలర్లను వినియోగించారు. ఐఐటీ బాంబే పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అంటే కేవలం వేగంగా పూర్తి చేయడమే కాకుండా.. నాణ్యతలోనూ ఎక్కడా రాజీపడలేదు.

ఐదు రోజుల్లో మరో రెండు రికార్డులు

తొలి రెండు రికార్డు సృష్టించిన ఐదు రోజుల్లోనే అంటే జనవరి 11వ తేదీన మరో రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించారు. 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌తో నిరంతరాయంగా రహదారిని నిర్మించారు. అలాగే 156 లేన్ కిలోమీటర్ల నిర్మాణం(52 కిలోమీటర్ల పొడవుతో మూడు లేన్ల రహదారి) పూర్తి చేశారు. ఇది గత ప్రపంచ రికార్డు 84.4 లేన్ కిలోమీటర్లను బద్ధలగొట్టింది. మొత్తంగా ఒక్క వారంలోపే ఒకే కారిడార్‌పై నాలుగు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. ఈ రికార్డులను అధికారికంగా గుర్తిస్తూ తాజాగా గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్లను కూడా ప్రదానం చేసింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా ఈ సర్టిఫికెట్లను అందజేశారు.

Read More:

వాహనదారులకు గుడ్‌ న్యూస్‌.. డిసెంబర్ నుంచి టోల్ ప్లాజాలు ఉండవు.. ప్రయాణించిన దూరానికే చార్జ్‌

HAM Roads Scam : హ్యామ్‌ మోడల్ కాదు.. కాంగ్రెస్ స్కామ్‌ మోడల్!