Telangana municipal elections 2026| మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా.. చతికిలబడిన బీజేపీ, కోలుకోని బీఆర్ఎస్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో అత్యధిక మున్సిపాలిటీలు హస్తగతం చేసుకున్నది.

విధాత, హైదరాబాద్:
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 90 మున్సిపాల్టీలు, ఐదు కార్పొరేషన్లలో విజయబావుటా ఎగురవేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు అయినా ప్రజల్లో బలం తగ్గలేదని కాంగ్రెస్ నిరూపించుకున్నది. బీఆర్ఎస్ పార్టీ 12 మున్సిపాల్టీలను మాత్రమే దక్కించుకోగలిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు గాలి వీస్తున్నదని, కుంభకోణాలతో నిండిపోయిందని ప్రచారంలో దుమ్మెత్తిపోసిన బీజేపీ కేవలం నారాయణపేట మున్సిపాల్టీని మాత్రమే కైవసం చేసుకుని బోల్తాపడింది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కాషాయ పార్టీ విజయం సాధించగా ఒక కార్పొరేషన్‌లో హంగ్ వచ్చింది.

ఈ ఎన్నికలకు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాల్టీలలో కాంగ్రెస్ 90, బీఆర్ఎస్ 12, బీజేపీ 1, ఎంఐఎం 1 చొప్పున గెలుపొందగా, 12 మున్సిపాల్టీల్లో హంగ్ వచ్చింది. పరకాల, అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత, ఇంద్రేశం మున్సిపాల్టీలలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాల్టీలు ఉండగా కాంగ్రెస్ ఆరు, బీఆర్ఎస్ ఆరు గెలుపొందాయి. ఏడు మున్సిపాల్టీలలో (జహీరాబాద్, ఇస్నూర్, కోహిర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్) హంగ్ రావడం విశేషం. ఈ జిల్లా నుంచి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఏడు కార్పొరేషన్లలో రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్లగొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. కరీంనగర్ లో బీజేపీ గెలుపొందింది. ఇక్కడ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ అన్నీ తానై అక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం మూలంగానే మొత్తం 66 డివిజన్లకు గాను 33 డివిజన్లలో గెలుపొందిందని అంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. స్థానిక ఎంపీ డీ అర్వింద్ శ్రమించినప్పటికీ మెజారిటీ మార్క్ ను అధిగమించలేదు.

కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడగా ఇక్కడ సీపీఐ కు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మేయర్ సీటు సీపీఐకే ఇస్తామని, బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. కొత్తగూడెంలో ఏ రకంగా చూసినా హంగ్ వస్తుండటంతో సీపీఐ రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపై మేయర్ పీఠం ఆధారపడి ఉంది.

అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో కూడా అపజయం సాధించలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఆ తరువాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప్ప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రెండు ఎన్నికల తదనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుపొంది సత్తా నిరూపించుకున్నది. తాజాగా జరిగిన మున్సిపాల్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ప్రజల్లో పట్టు కోల్పోలేదని అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు తెలియచేసింది.

ఈ నాలుగు ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుకు సాగారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏ ఒక్క మున్సిపాల్టీని కోల్పోకుండా గెలుచుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. వారం రోజుల పాటు జిల్లాల వారీగా సుడిగాలి పర్యటనలు చేసి ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వ్యవహార శైలిని తూర్పారపట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను మున్సిపాల్టీల్లో గెలిపిస్తే మరిన్ని నిధులు వస్తాయని, డెవలప్ మెంట్ కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని ప్రజలను కోరారు. ఇవ్వాల్టి ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారనేది స్పష్టమవుతున్నది.

అలవికాని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒకటి రెండు తప్ప ఏదీ అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ తో దోస్తానా చేస్తూ అసలైన కాంగ్రెస్ నాయకులకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలు తగ్గుతాయని ఓటర్లను అప్రమత్తం చేశారు. అవినీతి ఏరులై పారుతోందని, తెలంగాణ సోయి లేదని విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు పెద్దగా విశ్వసించలేదు. బీజేపీ నాయకులు ఎవరికి వారుగా ప్రచారం చేయడంతో ఒక మున్సిపాల్టీ, ఒక కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నది. నిజామాబాద్ కార్పొరేషన్ లో హంగ్ వచ్చింది. రాష్ట్ర నాయకులు సమన్వయంతో కాకుండా ఎవరికి వారుగా గ్రూపులుగా ఏర్పడి తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇవ్వాల్టి మున్సిపాల్టీ ఫలితాల్లో కూడా ఏమాత్రం ప్రభావం చూపించకుండా చతికిలపడింది. మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు గడప దాటడం లేదనే విధంగా రాష్ట్ర కాషాయ నేతల పరిస్థితి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాల్టీలో 10 సీట్లకు గాను 8 సీట్లను ఫార్వార్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని మాజీ ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత వర్గీయులు ప్రచారం చేసుకుంటుండగా, ఆమెతో తమకు సంబంధం లేదని ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇదే ఊపుతో పరిషత్ ఎన్నికలకు

కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూకుడుగా ఉన్నది. మున్సిపాల్టీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆదరణ చూపించి అత్యధిక స్థానాలను ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే నెలలో నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నది. ఆ నెల 16వ తేదీతో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియనుండడంతో 17 లేదా 18వ తేదీ నుంచి రైతు భరోసా సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వరుసగా వారం లేదా తొమ్మిది రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేసి పరిషత్ ఎన్నికలకు సిద్ధం కానున్నారు. పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలు వస్తాయనే ధీమాతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ తరువాత హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Latest News