Hyderabad | హైదరాబాద్ నగరాన్ని అగ్నిప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఓ క్లాత్ షోరూంలో మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఆసిఫ్‌నగర్‌లో పెట్రోల్ నింపిన వెంటనే బైక్‌లో అగ్నికీలలు ఎగిసిపడి పూర్తిగా దగ్ధమైంది. తాజాగా శనివారం తెల్లవారుజామున సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ వైన్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.
వైన్ షాపులో చెలరేగిన మంటలను స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. క్షణాల్లోనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించలేదు.
ఈ అగ్నిప్రమాదంలో మద్యం బాటిళ్లు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని, నష్టం విలువపై, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
