Kota Srinivasa Rao | హైదరాబాద్ : ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంట్లోనే కోట కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రల్లో పోషించి.. సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 750కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1999 – 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, విలన్‌గా విభిన్నమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర, యువ హీరోలతో కలిసి కోట శ్రీనివాస రావు నటించారు. అహనా పెళ్లంట, ప్రతి ఘటన, యముడికి మొగుడు, ఖైదీ నం:786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసు గుర్రం ఇలాంటి ఎన్నో సినిమాలు కోట శ్రీనివాస రావుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.