Site icon vidhaatha

Tollywood producer | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి.. హీరో మహేష్‌బాబుకు ఆయన..!

Tollywood producer : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (73) మృతి చెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సోమవారం) ఉదయం ఆయన మరణించారు. ఉప్పలపాటి మరణంతో టాలీవుడ్‌లో విషాధ ఛాయలు అలముకున్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆయన మరణ వార్తను ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. ఆయన మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

సూర్యనారాయణ బాబు స్వయానా హీరో కృష్ణకు చెల్లెలి భర్త. అంటే హీరో మహేష్‌బాబుకు ఆయన మేనత్త భర్త. కృష్ణ చెల్లెలు లక్ష్మి తులసిని పెళ్లి చేసుకున్న సూర్యనారాయణ బాబు నిర్మాతగా పద్మావతి బ్యానర్‌పై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. హీరో కృష్ణ స్వయంగా ప్రోత్సహించి తన పద్మాలయా బ్యానర్‌లాగా పద్మావతి బ్యానర్‌ను బావగారితో పెట్టించి తాను కూడా దగ్గరుండి నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు. ఎప్పటికైనా మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్న సూర్యనారాయణ బాబు ఆ కోరిక తీరకుండానే మరణించారు.

పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆయన మనుషులు చేసిన దొంగలు సినిమాతో నిర్మాతగా మారారు. 1977లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దొంగల దోపిడీ, రామ్ రాబర్ట్ రహీమ్, బజార్ రౌడీ, శంఖారావం లాంటి చిత్రాలను నిర్మించి కమర్షియల్ నిర్మాతగా ఆర్థికంగా విజయాలు అందుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రెండు హిందీ చిత్రాలను నిర్మించారు. కన్నడంలోనూ అగ్ర హీరో అంబరీష్‌తో రెండు సినిమాలు తీశారు.

ప్రముఖ నటి సుజాత కథానాయికగా ఎ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈయన నిర్మించిన ‘సంధ్య’ చిత్రం కమర్షియల్‌గా హిట్ సాధించడమే కాకుండా అభిరుచి కలిగిన నిర్మాతగా ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకునేలా చేసింది. లో బడ్జెట్‌తో నిర్మించిన ఆ సినిమాకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సుజాత కూడా ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. దాదాపు 20కి పైగా చిత్రాలను తీసిన సూర్యనారాయణ బాబు కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే తన మనవడు అభినవ కృష్ణ ‘ధోవతీ’ వేడుకలను అత్యంత వైభవంగా సినీ ప్రముఖుల మధ్య జరిపారు. అదేరోజు హీరో కృష్ణ పుట్టినరోజు వేడుకలు చేశారు.

ఒకేసారి రెండు వేడుకలు జరగడంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఆనందసాగరంలో మునిగిపోయింది. హీరో కృష్ణ మీద ఉన్న అభిమానంతో తన మనవడికి అభినవ కృష్ణ అనే పేరు పెట్టుకున్నారు. తన బావ కృష్ణ మరణం ఆయనను బాగా కుంగదీసింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన సూర్యనారాయణ బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తన పద్మావతి బ్యానర్‌పై ఓ భారీ పాన్ ఇండియా సినిమా తీయాలని అనుకున్నారు. మహేష్ డేట్స్ ఇస్తే సినిమా మొదలు పెట్టాలని భావించారు. కానీ ఆ కోరిక తీరకుండానే మృతిచెందారు. సూర్యనారాయణ బాబు మృతిపపట్ల పలువురు నిర్మాతలు, నటులు, దర్శకులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Exit mobile version