Vijay| ప్రస్తుతం సినిమా వాళ్లు రాజకీయాలలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదివరకే సొంత పార్టీని ప్రకటించిన ఆ పార్టీకి తమిళగ వెట్రి కజగం (TVK) నామకరణం చేసినట్లు తెలిపారు. సౌతిండియన్ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులు ఉన్న రజినీకాంత్ చేయలేని పనిని విజయ్ సాధించినట్టయింది. అయితే ఈ రోజు తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈరోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా మన జెండా ఎగురుతుంది, తమిళనాడు ఇకముందు గొప్పగా ఉంటుందని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు సాహిత్యం రచయిత వివేక్ అందించారు
చెన్నై పనయూర్‌లోని తమిళగ వెట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. నాయకులకి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్ మరియు శోభ కూడా పాల్గొన్నారు.విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు వచ్చిన విజయ్ మొదటగా తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇక విజయ్ ఆవిష్కరించిన తమిళగ వెట్రి కజగం జెండాలో ఎరుపు , పసుపు రంగులు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అందులో రెండు ఏనుగులు, మధ్యలో వాగై పువ్వు కూడా ఉన్నాయి. పార్టీ గుర్తు ఆవిష్కరణ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ప్రధాన పార్టీలకు చెమటలు తప్పవని తెలుస్తోంది. మరి విజయ్ రాజకీయ వ్యూహం ఎలా ఉండనుందో.. రాజకీయాల్లో విజయం సాధిస్తాడో లేదో చూడాలి.