Site icon vidhaatha

Nagarjuna | నాగార్జున పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖపై తీసుకునే చర్యలు ఇవే..!

Nagarjuna | టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నాగార్జున (Akkineni Nagarjuna) నాంపల్లి కోర్టు (Nampally Court)లో తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)పై పరువునష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం భార్య అమల, తనయుడు నాగచైతన్య, మేనకోడలు సుప్రియతో హాజరయ్యారు. ఈ నెల 2న బాపూఘాట్‌ వద్ద నాగచైతన్య, సమంత డైవర్స్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయొద్దంటే సమంతను పంపాలని కేటీఆర్‌ కోరాడని.. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతోనే నాగచైతన్య డైవర్స్‌ ఇచ్చాడంటూ కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని.. ఇద్దరూ ఇష్టప్రకారమే డైవర్స్‌ తీసుకున్నారన్నారు.

మహిళ అయి ఉండి సాటి మహిళపై నిరాధారమైన ఆరోపణలు చేశారని.. మంత్రి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేధనకు గురైందని.. పరువుకు భంగం కలిగిందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో వాదనలు వినిపించారు. ఆయన మేనకోడలు సుప్రియ వాంగ్మూలాన్ని సైతం కోర్టు రికార్డు చేసిందని సమాచారం. ఈ కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. నాగార్జున తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. అయితే, నాగార్జున తరఫున వాదనలు వినిపించిన లాయర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తుందన్నారు.

ఆ సమయంలో పిటిషన్‌పై వాదనలు వినిపించాలని చెప్పడంతో పాటు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోర్టు కోరుతుందన్నారు. అయితే, కొత్త చట్టాల మేరకు మంత్రిపై చర్యలు తీసుకోవచ్చని లాయర్‌ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మంత్రి క్షమాపణలు చెప్పారని పలువురు వాదిస్తుండగా.. వాటిని ఒప్పుకోవడం.. తిరస్కరించడం నాగార్జునపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఇందులో కోర్టు సైతం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. మంత్రికి రెండేళ్లు లేదంటే కఠిన శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. నాగార్జున పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విధితమే. ప్రస్తుతం అక్టోబర్‌ 10న కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version