Yash|కేజీఎఫ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో యష్(Yash). ఈ సినిమా హిట్‌తో కేజీఎఫ్ 2 చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా కూడా హిట్ కావడంతో యష్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ హీరో సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం వివాదంలో పడినట్టు తెలుస్తుంది. ‘టాక్సిక్‘ షూటింగ్ కోసం అటవీ భూముల్లోని చెట్లను అడ్డగోలుగా నరికేశారంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సినిమాల కోసం పెద్ద మొత్తంలో చెట్లను ధ్వంసం చేస్తున్నారంటూ పర్యావరణ కార్యకర్తల నుంచి కర్నాటక ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
గతంలో శాటిలైట్ చిత్రాలను.. ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించారు. చెట్లు నరికేసినట్లు నిర్థారించుకున్నారు అధికారులు. ఫిర్యాదులు రావడంతో ఏకంగా అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే యష్ టాక్సిక్(Toxic) మూవీ షూటింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి చెట్లు నరికివేతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీణ్య సమీపంలో ఉన్న ఈ హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ జరిగింది. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేశారన్నారు మంత్రి కండ్రే. అయితే ఎన్ని చెట్లను నరికివేశారు? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారి ఎవరు,అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అటవీ భూముల్లో చెట్లు అక్రమంగా నరికివేశారంటూ వస్తున్న వార్తలను ‘టాక్సిక్’ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కొట్టిపారేసింది. తమ సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని ..“మేం షూట్ చేస్తున్నది ప్రైవేట్ ప్లేస్. షూటింగ్ కు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నాం. ఫిబ్రవరి 2024లో షూటింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు అందించాం. మేము అటవీ శాఖ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. తమ మీద తప్పుడు కేసులు పెడితే, కోర్టులో సవాల్ చేస్తాం అంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్(Supreeth) వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.