Atul Subhash । నిఖిత సింఘానియా! బెంగళూరులో ఇటీవల భార్య, అత్తింటి వేధింపులను తట్టుకోలేక తనువు చాలించిన సీనియర్ టెక్ ఎగ్జిక్యూటివ్ అతుల్ సుభాష్ భార్య! ఒకవైపు పోలీసులు జల్లెడ పట్టి వెతుకుతుంటే.. దొరకకుండా.. ముందస్తు బెయిల్ కోసం విఫయత్నాలు చేసిన నిఖిత.. ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయింది. పోలీసుల కళ్లుగప్పి రోజుకొక ఊరిలో ఉంటూ ఇన్నాళ్లూ నిఖిత తప్పించుకుని తిరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆదివారం అరెస్టయిన నిఖితతోపాటు ఆమె తల్లి, సోదరుడికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిఖిత సింఘానియా హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్టవగా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పట్టుబడ్డారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య అనంతరం బెంగళూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్ చేరుకోవడంతో నిఖిత కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో మూడు రోజుల్లోగా పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ వారి ఇంటికి నోటీసులను అతికించిన పోలీసులు.. వారి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరిని పట్టుకునే క్రమంలో నిందితుల గురించి, ఎవరి దగ్గరకు వెళ్లి ఉండచ్చనే విషయంలో బంధువులు, స్నేహితులు గురించి పూర్తి సమాచారం సేకరించినట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు. వారి కదలికలపైనా పోలీసులు కన్నేసి ఉంచారు. నిందితులు చాకచక్యంగా కేవలం వాట్సాప్‌లో మాత్రమే కాల్స్ చేసుకుంటూ ఉండటంతో వారిని జాడ కనిపెట్టడం కష్టమైందని పోలీసులు తెలిపారు. కానీ.. నిందితులు ఎక్కడో ఒక చోట తప్పు చేస్తారు. నిఖిత కూడా పొరపాటున తన బంధువు ఒకరికి ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. అప్పటికే ఆమె ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేస్తున్న పోలీసులు.. టవర్ లొకేషన్ ఆధారంగా హర్యానాలోని గురుగ్రామ్ వెళ్లారు. అక్కడ రైల్ విహార్ ఏరియాలోని ఒక పీజీ హాస్టల్‌లో ఉన్న విషయాన్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఇక నిఖిత నుంచి సమాచారం రాబట్టారు. తన తల్లికి, సోదరుడికి ఫోన్ చేయించారు. వారి లొకేషన్లు కూడా ట్రాక్ చేసిన పోలీసులు.. ఉత్తరప్రదేశ్‌లోని ఝున్సీ పట్టణంలో వారిద్దరినీ పట్టుకున్నారు. ట్రాన్సిట్ సమయంలో దాదాపు 9 గంటలపాటు ముగ్గురినీ బెంగళూరు పోలీసులు విచారించారు. నిఖిత, అతుల్ రెండేళ్ల కొడుకు బంధువుల వద్ద భద్రంగా ఉన్నట్టు ధృవీకరించుకున్నారు. నిందితుల స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకుని.. జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.
అయితే.. తాను ఎప్పుడూ అతుల్ సుభాష్‌ను వేధించింది లేదని నిఖిత పోలీసులకు చెప్పిందని సమాచారం. అతని నుంచి మూడేళ్లుగా దూరం ఉంటున్నానని చెప్పినట్టు తెలిసింది. అయితే.. అతుల్‌కు, నిఖితకు పుట్టిన బిడ్డను తమకు స్వాధీనం చేయాలని అతుల్ కుటుంబీకులు కోరుతున్నారు. తాము ఆ చిన్నారిని చూడాలని అనుకుంటున్నామని మృతుడు అతుల్ సుభాష్ సోదరుడు బికాస్ కుమార్ చెప్పారు. నిందితులను శనివారం రాత్రి బెంగళూరుకు తీసుకొని వచ్చారు. కోర్టులో హాజరుపర్చగా వారిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌కు ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి పాల్పడిన సుభాష్.. 15 రోజుల ముందుగానే అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడని తెలుస్తున్నది. సుదీర్ఘ డెత్ నోట్ రాయడంతోపాటు.. పలు న్యాయపరమైన అంశాలపై గూగుల్‌లో శోధించినట్టు తేలింది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 108, 3 (5) కింద డిసెంబర్ 9న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికి ముగ్గురు అరెస్టవగా, నాలుగో నిందితుడు, నిఖిత బంధువు సుశీల్ సింఘానియా కోసం పోలీసులు వెతుకుతున్నారు.