Site icon vidhaatha

గుజరాత్‌లో 800 కోట్ల కొకైన్‌ పట్టివేత

రాజ్‌కోట్‌: గుజరాత్‌ లోని కచ్‌ జిల్లాలో మరోసారి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇక్కడి మితిరోహర్‌ గ్రామంలో దాదాపు 800 కోట్ల రూపాయల విలువ చేసే 80 కేజీల కొకైన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తీరప్రాంత గ్రామం అదానీ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న గాంధీధామ్‌ నౌకాశ్రయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఈ తీరం వెంబడి పహారా కాస్తున్న సమయంలో అనుమానాస్పద ప్యాకెట్లు తీరంలో కొన్ని, సముద్రంలో తేలియాడుతూ కొన్ని కనుగొన్నారు.


వాటిని స్వాధీనం చేసుకుని లెక్కించగా.. ఒక్కొక్కటి కిలో బరువు కలిగిన 80 ప్యాకెట్లు ఉన్నాయి. అందులో ఉన్నది కొకైన్‌ అని ఫోరెన్సిక్‌ నిపుణులు ధృవీకరించారు. మాదక ద్రవ్యాలను నేరుగా వ్యక్తులకు అందించడం కాకుండా.. జన సంచారం అస్సలు ఉండని తీర ప్రాంతాల్లో వదిలేయడం అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియా కొత్త విధానంగా కనిపిస్తున్నదని కచ్ (తూర్పు) ఎస్పీ సాగర్‌ బాగ్‌మర్‌ చెప్పారు. వీటిని ఇక్కడి మాఫియా వ్యక్తులు తీసుకొని వెళుతుంటారని పేర్కొన్నారు.


ఈ విషయంలో చుట్టుపక్కల గ్రామస్థులను అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వీటిని అందుకోవాల్సి ఉన్నదనే అంశాలను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పాకిస్థాన్‌కు సమీపంలో ఉండే కచ్‌ జిల్లాలో గతంలో కూడా భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ వందల కోట్ల విలువ చేసే మొత్తంలో ఉన్నవి కావడం గమనార్హం.

Exit mobile version