Site icon vidhaatha

37 మంది పిల్లలతో వెళుతున్న స్కూలు బస్సు బోల్తా

ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో బుధవారం ఉదయం ఒక బస్సు ప్రమాదం నుంచి చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. బధౌన్ రోడ్డులో ఒక వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 37 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.


చిన్నారులు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షాజహాన్‌పూర్‌ జిల్లా జలాలాబాద్ పట్టణంలో రోసీ పబ్లిక్ స్కూల్ నడుస్తోంది. ఉదయం ఈ స్కూల్ బస్సులో కలాన్ మిర్జాపూర్, జరియన్ పూర్, పవర్ పూర్, దోస్ పూర్ తదితర గ్రామాలకు చెందిన చిన్నారులు పాఠశాలకు వెళుతున్నారు. బధౌన్ రోడ్డులోని అమృతపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగుల గ్రామం సమీపంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉన్నది. ఆ సమయంలో ఓవర్‌టేక్‌ చేస్తుండగా బస్సు 10 అడుగుల లోతున్న లోయలోకి బోల్తా కొట్టింది. వెంటనే చుట్టుపక్కలవారు ఘటనా స్థానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. మీర్జాపూర్ గ్రామానికి చెందిన ఆదిత్య తలకు గాయం కాగా అతని సోదరి దివ్యంషి చేతికి గాయమైంది. మిగిలిన 35 మంది చిన్నారులు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. వారందరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

Exit mobile version