నిజామాబాద్ లో బీజేపీ, బీఆరెస్ సవాళ్లతో ఉద్రిక్తత

  • Publish Date - November 13, 2023 / 01:59 PM IST

  • నిజామాబాద్ లో కంఠేశ్వర్ చౌరస్తా వద్ద మోహరించిన పోలీసులు
  • కోడ్ నిబంధనలతో నాయకులకు అడ్డుకట్ట
  • మీడియా సమావేశాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు

విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యల సవాళ్లు, ప్రతిసవాళ్లతో సోమవారం ఉదయం నగరంలో టెన్షన్ వాతావరణ నెలకుంది. ఎమ్మెల్యే బిగాల అన్యాయంగా, అక్రమంగా సంపాదించారని, నగరంలో పలు కబ్జాలు చేశారని, కొందరిని బెదిరించి భూములు లాక్కున్నారని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ ఆరోపించారు. వీటికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే తాను విసిరిన బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. తాను సంపాదించింది అంతా సక్రమమే అని, అక్రమంగా సంపాదించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీగాల అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధనపాల్ సూర్య నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కంఠేశ్వర్ చౌరస్తాలో రావాలని, అక్కడ బహిరంగంగా చర్చించుకుందాం అని రెండు రోజుల క్రితం సవాలు చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ లో సోమవారం హైటెన్షన్ నెలకుంది.

రంగంలోకి దిగిన పోలీసులు

నగరంలో అభివృద్ధిపై చర్చకు రావాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు చేసుకున్న సవాళ్లపై పోలీసులు ఆంక్షల కొరడా ఝుళిపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి బహిరంగ చర్చలకు అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ ఇంటికి ఉదయం చేరుకున్న పోలీసులు.. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అతికించారు. ధన్పాల్ సూర్యనారాయణ అందుబాటులోకి రావడంతో ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఎమ్మెల్యే బిగాలకు సవాల్ చేసిన ధన్పాల్ ఉదయం పది గంటలకు కంఠేశ్వర్ గుడి వద్దకు చర్చకు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీఎత్తున మోహరించారు. అంచనాను కాదని వస్తే అరెస్ట్ చేయడానికి పోలీసు శాఖ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇరువురి సవాళ్లు, ప్రతి సవాళ్లకు పోలీస్ శాఖ అడ్డుకట్ట వేయడంతో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్త చర్చకు రాకుండా తప్పించుకున్నారని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. బహిరంగ చర్చకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తే ఇండోర్లో చర్చకు రావాలని, తన ఇంటికి వచ్చినా సరే, లేదంటే నేనే బిగాల గణేష్ గుప్తా ఇంటికి వెళ్ళడానికి కూడా సిద్ధమేనన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తప్పించుకోలేరన్నారు.

Latest News