Ugadi Pachadi | ఉగాది పచ్చడి సేవనంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

  • Publish Date - April 9, 2024 / 08:28 AM IST

Ugadi Pachadi | ఉగాది పండుగ తెలుగువారి ఎంతో ముఖ్యమైన పండుగ. ఆధ్యాత్మిక, ధార్మిక చింతన భావాలతో పాటు ఆరోగ్య సూత్రాలూ మిళితమై పండగలో మిళితమై ఉన్నాయి. ఆరు రుతువుల్లో సహజంగా వాత, పిత్త, కఫ దోషాలు కలుగుతాయి. వీటిని ఆయుర్వేద నిపుణులు త్రిదోషాలుగా పేర్కొంటారు. వసంత రుతువులో కఫం ప్రకోపిస్తుంది. దాన్ని నివారించేందుకు కటు, తిక్త, కషాయ రసాలు ఉపకరిస్తాయి. అందుకే ఉగాదిన సంపూర్ణ ఆరోగ్యానికి షడ్రుచులను పచ్చడి రూపంలో స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిలో వినియోగించే వస్తువుల్లో కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, మామిడికాయలు, పచ్చిమిరప, వేపపువ్వు ప్రాశస్త్యం పొందాయి. వీటినే బెల్లం (తీపి), చింత (పులుపు), లవణం (ఉప్పు), కటువు (కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు) అనే షడ్రుచుల మేళవంగా పేర్కొంటారు. భిన్నమైన రుచులను ఒక చోట చేర్చడం జీవితంలోని సమన్వయత్వానికి సంకేతం. ఈ పండుగ వచ్చేటప్పటికి రుతువుల్లోని తేడా వల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యాన్ని తొలగించేదే ఉగాది పచ్చడి.

మనకు అందించే సందేశం..

ఉగాది పండుగ మన జీవితంలో ఎదరయ్యే మంచి, చెడు, కష్ట, సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని మనకు అందిస్తున్నది. అలాగే, ఈ కాలంలో అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు ఈ సమయంలో వ్యాపస్తుంటాయి. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఈ పండుగ వెనుక ఒక వైజ్ఞానిక అంశం ఉంది. ఉగాది పచ్చడిని ఒక మహా ఔషధమని పెద్దలు చెబుతుంటారు. ఈ ఉగాది పచ్చడి తినడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉండే నులిపురుగులను నిర్మూలిస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన అంటూ వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇప్పటికి కూడా అమ్మోరు పోస్తే.. ఎన్ని మందులు ఇచ్చినా.. వేప మండలు మాత్రం వేయకుండా ఉండరు. అలాగే, మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. కఫం, వాతం, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది. మామిడిలో విటామిన్ ‘సీ’ అధికంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకత శక్తిని పెంపొందిస్తుంది. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. అలాగే, రక్త హీనతని దూరం చేస్తుంది.

తైల అభ్యంగన స్నానంతో..

ఉగాది పండుగ రోజున చేసే తైల అభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం చేయడం)శరీరంలో ఉన్న టాక్సిన్స్ తొలగిస్తుంది. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసి బయటపడేస్తాం. ఇండ్లు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరిస్తాం. ఇలా శుభ్రం చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. ఉగాది పండుగ సందర్భంగా మన ఇంటిని పూలతో అలకరిస్తూ ఉంటాం. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలుంటాయి. మామిడి ఆకుల ఇంట్లోకి క్రిములు రాకుండా అడ్డుకుంటాయి. ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను నిర్మూలిస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి.

షడ్రుచులతో లాభాలు..

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని ‘నింబ కుసుమ భక్షణం‘, ‘అశోకకళికా ప్రాశనం‘ పేర్లతో పిలిచేవారు. రుతువులలో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే రోగాల నుంచి రక్షణగా.. ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంతకుముందు ఉగాది పచ్చడిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవారు. బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు విజయానికి సంకేతంగా భావిస్తారు. వేపలోని చేదు దుఃఖానికి, నష్టానికీ, ద్వేషానికీ, అపజయానికి సంకేతంగా భావిస్తుంటారు. ఈ రెండు కలిపి తీసుకుంటే కష్టసుఖాలు, ప్రేమానురాగాలు, విజయం చేకూరుతాయి. ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం (తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం (మామిడి) సమ్మేళనం. ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను అందిస్తున్నది. అందరూ తప్పకుండా ఉగాది రోజున పచ్చడిని తీసుకోవడం మరిచిపోవద్దు.

Latest News