తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోతిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులు పాటు జరిగే శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి

  • Publish Date - April 21, 2024 / 03:54 PM IST

ఒంటిమిట్టలో ఏప్రిల్ 22వ సీతా రాముల‌ కల్యాణం
యాదాద్రిలో పెరిగిన రద్ధీ

విధాత : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోతిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులు పాటు జరిగే శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని నాలుగు మాడవీధులలో ఊరేగించారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేేర్చారు. రెండవ రోజు సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహింపచేసి తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. ఆ తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఆర్జిత సేవల రద్దు
కాగా వసంతోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు తిరుమలలో ఆర్జిత సేవలు నిలిపివేశారు. వసంతోత్సవాల సందర్భంగా… ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమలో ఆదివారం పెరిగిన రద్ధీతో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది.

ఒంటిమిట్టలో నేడు సోమవారం సీతారాముల కల్యాణోత్సవం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సోమవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభ‌వంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న మొదలై ఈ నెల 25 వరకు వైభవంగా జరుగనున్నాయి.

యాదాద్రిలో పెరిగిన రద్ధీ
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్ధీతో కొండపైన ఆలయ ప్రాంగణం..క్యూలైన్లు కిక్కిరిశాయి. స్వామివారి దర్శనం కోసం రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది.

Latest News