Governor Jishnu Dev Verma | విధాత, వరంగల్ ప్రతినిధి: ప్రయోగాశాలకే పరిమితం కాకుండా జీవితంలో సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నేటి యువత పరిశోధన, అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను నిర్దేశిస్తున్నారని అన్నారు. కేయూ విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవ సందర్భంగా పీహెచ్‌డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో సోమవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ ప్రసంగించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఉత్తర తెలంగాణాలో ఒక మహత్తర విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది అన్నారు. కేవలం వనరుల వల్ల మాత్రమే సాధ్యం కాదని ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థుల విజన్, పట్టుదలవల్ల సాధ్యమైనవి అన్నారు.
మహాత్మా గాంధి అనట్టు “ విద్య అంటే శరీరం, మనస్సు, ఆత్మ అన్నింటిలోనే అత్యుత్తమని వెలికి తీయడమేనన్నారు. ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల మెరుగుదల దీనికి అనుగుణంగా కృత్రిమ మేధా, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సు, న్యూట్రిషన్ సైన్సు కోర్సులు కాకతీయ యూనివర్సిటీలో ప్రారంభించడం అభినందనీయం అన్నారు. క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, క్యురియాసిటి, కమ్యూనికేషన్ లాంటి నైపుణ్యాలు 21వ శతాబ్దపు దిక్సూచిలు అన్నారు. ధైర్యంగా ముందుకు సాగుతూ మార్పును ఆమోదించాలని,దయ, నైపుణ్యం తో సేవ చేయాలని అన్నారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ సంచాలకులు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహిత డాక్టర్ డి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ లు, ప్రోఫెసర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.