Site icon vidhaatha

Alzheimer’s | అల్జీమ‌ర్స్‌ను మ‌నం గెల‌వ‌గ‌ల‌మా? .. సానుకూల ఫ‌లితాలిస్తున్న ఔష‌ధం

Alzheimer’s

విధాత‌: అల్జీమ‌ర్స్‌ను నిరోధించ‌డానికి జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. తాజాగా ఎలీ లిల్లీ సంస్థ త‌యారుచేసిన ఓ ఔషధం వైద్యుల‌కు ఆశాకిర‌ణంలా క‌నిపిస్తోంది. అల్జీమ‌ర్స్ (Alzheimer’s) ను తొలి ద‌శ‌లోనే గుర్తించి ఈ ఔషధాన్ని ఇస్తే అది ముద‌ర‌కుండా చేయొచ్చ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. దీనికి సంబంధించిన వివ‌రాలు జేఏఎంఏ జ‌ర్న‌ల్‌లో తాజాగా ప్ర‌చురిత‌మ‌య్యాయి. అల్జీమ‌ర్స్ అనేది డిమెన్షియా శ్రేణికి చెందిన వ్యాధి. ఇది మెద‌డుపై ప్ర‌భావం చూపిస్తుంది. మెల్ల‌గా జ్ఞాప‌కాల్ని తుడిచిపెట్టేసి, ఆలోచ‌నా శ‌క్తిని క్షీణింపచేస్తుంది. దీంతో రోజువారీ త‌మ ప‌నులు తాము చేసుకోవ‌డానికి కూడా ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి త‌లెత్తుతుంది.

ఆమ్‌స్ట‌ర్‌డాంలోని అల్జీమ‌ర్స్ అసోసియేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫెర‌న్స్ వేదిక అల్జీమ‌ర్స్‌పై చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ ఔష‌ధాన్ని ప‌రిశీలించారు. దీనిని డొనానెమాబ్ (Donanemab) అనే పేరును పెట్టారు. ప‌రిశోధ‌న‌లో భాగంగా 1700 మంది అల్జీమర్స్ బాధితులకు డొనానెమాబ్ ఇవ్వ‌డం ద్వారా వారి ప‌రిస్థితిని స‌మీక్షించారు. మందు తీసుకున్న వారిలో ఆలోచ‌న‌ను కోల్ప‌యే వేగం మూడో వంతుకు త‌గ్గింద‌ని గుర్తించారు. అయితే వారు వ్యాధి ప్రారంభద‌శ‌లో ఉంటే మాత్ర‌మే ఈ ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని, బాగా వృద్ధుల‌కు, వ్యాధి ముదిరిన వారికి, టావ్ అనే ప్రొటీన్ స్థాయులు ఎక్కువ‌గా ఉన్న వారిలో ఎలాంటి సానుకూల ఫ‌లితాలు క‌నిపించ‌లేదని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అయితే అల్జీమ‌ర్స్‌కు ఎటువంటి చికిత్సా లేదు. క‌నీసం సాంత్వ‌న చేకూర్చే వైద్య విధానాలూ అభివృద్ధి చెంద‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో డొనానెమాబ్ ఇచ్చిన ఫ‌లితాలు అల్జీమ‌ర్స్‌పై పోరాటంలో కీల‌క మ‌లుపుగా భావించొచ్చు.

లిల్లీ సంస్థ త‌యారుచేసిన డొనానెమాబ్‌కు ఇంకా ఎఫ్‌డీయే అనుమ‌తి ల‌భించాల్సి ఉంది. ఈ సంవత్స‌రాంతానికి అనుమ‌తి రావొచ్చ‌ని సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు అయిదున్న‌ర కోట్ల మంది అల్జీమ‌ర్స్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా. ఇందులో 60 శాతం మంది దిగువ మ‌ధ్య ఆదాయ దేశాల్లోనే జీవిస్తున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం సుమారు కోటి కేసుల చొప్పున ఈ సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మొత్తం డిమెన్షియా వ్యాధుల్లో 60 నుంచి 70 శాతం అల్జీమ‌ర్స్ కేసులే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రాణాలు ఎక్కువ‌గా తీస్తున్న వ్యాధుల్లో డిమెన్షియా ఏడో స్థానంలో ఉంది. ఈ ద‌శ‌లో వ్యాధిని పూర్తిగా మాన్ప‌లేక‌పోయిన‌ప్ప‌ట‌కీ మ‌ర‌ణాన్నివాయిదా వేయ‌డం ద్వారా డొనానెమాబ్ మాన‌వాళికి తోడ్పాటు అందించే అవ‌కాశ‌ముంది.

Exit mobile version