కుటుంబ నియ‌త్ర‌ణ‌కు కొత్త ప‌ద్ధ‌తి..పురుషుల‌కు గ‌ర్భ‌నిరోధ‌క ఇంజ‌క్ష‌న్‌!

మీకు పెళ్ల‌యిందా? ఇప్పుడ‌ప్పుడే పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంటున్నారా? ఇటువంటి కేసుల‌లో సాధార‌ణంగా కండోమ్స్, ఫిమేల్ కండోమ్స్‌ పిల్స్‌, కాప‌ర్‌టీ లేదా ఇత‌ర గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నాలు, ప‌ద్ధ‌తులు వాడ‌టం స‌హ‌జంగా వ‌స్తూ ఉన్న‌ది

  • ప్ర‌పంచంలోనే ఇండియాలో తొలిసారి
  • క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి.. త్వ‌ర‌లో అందుబాటులోకి

న్యూఢిల్లీ: మీకు పెళ్ల‌యిందా? ఇప్పుడ‌ప్పుడే పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంటున్నారా? ఇటువంటి కేసుల‌లో సాధార‌ణంగా కండోమ్స్, ఫిమేల్ కండోమ్స్‌ పిల్స్‌, కాప‌ర్‌టీ లేదా ఇత‌ర గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నాలు, ప‌ద్ధ‌తులు వాడ‌టం స‌హ‌జంగా వ‌స్తూ ఉన్న‌ది. కండోమ్ వాడ‌కాన్ని కొంద‌రు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. ఇలాంటివారికి వైద్య‌రంగం కొత్త మార్గాన్ని చూపించేందుకు రంగం సిద్ధ‌మైంది. అదే ఇంజెక్ష‌న్‌. పురుషుల‌కు ఇచ్చే ఈ ఇంజెక్ష‌న్ ద్వారా వీర్య‌క‌ణాల చ‌ల‌న స్థితిని పూర్తిగా నిస్తేజం చేస్తారు. ఫ‌లితంగా అండంతో వీర్య‌క‌ణాలు క‌లువ‌లేవు. మ‌రో విశేషం ఏమిటంటే.. ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టిసారి భార‌తదేశంలోనే ఇవి త‌యారవుతున్నాయి.

ఇప్ప‌టికే వాటికి మూడో ద‌శ‌ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) పూర్తి చేసిన‌ట్టు ఇంట‌ర్నేష‌న‌ల్ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాల‌జీ జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది. ఇది పూర్తిగా సుర‌క్షిత‌మ‌ని, ఎలాంటి సీరియ‌స్ సైడ్ ఎఫెక్ట్‌లు లేవ‌ని పేర్కొన్న‌ది. స‌మ‌ర్థ‌వంతంగా ఫ‌లితాల‌నిస్తున్న‌ద‌ని తెలిపింది. మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో 25-40 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న 303 మంది పాల్గొన్నారు. ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ వివ‌రాల‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాల‌జీ జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది. న్యూఢిల్లీ, ఉధంపూర్‌, లూధియానా, జైపూర్‌, ఖ‌ర‌గ్‌పూర్‌ల‌లోని వేర్వేరు ద‌వాఖానల్లో ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. వీటిని ఐసీఎంఆర్ స‌మ‌న్వ‌యం చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తించింది.

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా ఆరోగ్య‌వంతులు, లైంగికంగా చురుకైన 303 మంది పెళ్ల‌యిన పురుషుల‌ను, అదే తీరుగా ఉండే వారి భార్య‌ల‌ను ఎంపిక చేశారు. వివిధ ద‌వాఖాన‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ ప‌ద్ధ‌తుల కోసం, వేసెక్ట‌మీ త‌దిత‌రాల కోసం వ‌చ్చిన‌వారి నుంచి వీరిని తీసుకున్నారు. వీరిలో పురుషుల‌కు రివ‌ర్సిబుల్ ఇన్‌హిబిష‌న్ ఆఫ్ స్పెర్మ్ అండ‌ర్ గైడెన్స్ (ఆర్ఐఎస్‌యూజీ) డ్ర‌గ్‌ను 60ఎంజీ ఇంజెక్ట్ చేశారు. దీని ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే.. అజూస్పెర్మియా (వీర్య‌క‌ణాల నిస్తేజ‌త‌)ను 97.3 శాతం సాధించ‌గ‌లిగిన‌ట్టు వెల్ల‌డైంది. అదే విధంగా గ‌ర్భ‌నిరోధం 99.02 శాతం వ‌ర‌కూ సాధ్య‌మైంది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొన్న‌వారెవ‌రికీ ఎలాంటి దుష్ప్ర‌భావాలు క‌లుగ‌లేద‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

ప్ర‌పంచ జ‌నాభా నానాటికీ పెరిగిపోతున్న త‌రుణంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌దిన అధ్య‌య‌నం అభిప్రాయ‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే దీర్ఘ‌కాలం ప‌నిచేసే, దుష్ప్ర‌భావాలు చాలా త‌క్కువ‌గా వ‌న్ టైమ్ ఇంజెక్ష‌న్ ప‌ద్ధ‌తి ఒక‌ట‌ని చెబుతున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి సాధార‌ణ స్థితికి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఇందులో ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్ఐఎస్‌యూజీ డ్ర‌గ్‌ను రూపొందించిన‌ట్టు అధ్య‌య‌నం వెల్ల‌డించింది. దీని వ‌ల్ల ఎలాంటి హార్మోన్ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్త‌బోవ‌ని పేర్కొన్న‌ది.

Latest News