Site icon vidhaatha

Covid-like Symptoms Surge । దేశంలో కొవిడ్‌ లక్షణాలతో పెరుగుతున్న ఫ్లూ కేసులు

కొవిడ్‌ లక్షణాలతో ఉంటున్న ఫ్లూ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొవిడ్‌ తరహాలోనే జ్వరం, దగ్గు, తీవ్ర అస్వస్థత లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. సొంత వైద్యం కాకుండా డాక్టర్లు సూచించిన మందులు వాడాలని స్పష్టం చేస్తున్నారు. డాక్టర్లు కూడా లక్షణాలకు తగిన విధంగా వైద్యం అందించాలని, యాంటిబయాటిక్స్‌ రాయవద్దని సూచిస్తున్నారు.

విధాత : Covid-19 దేశంలో ఫ్లూ లక్షణాలతో హాస్పటళ్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌ తరహాలో మరణాలకు దారి తీయకున్నా, హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సిన అసవరం లేకపోయినా బాధితుల్లో కొవిడ్‌ (Covid-19) తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు రెండు నుంచి మూడు వారాల వరకూ కొనసాగే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.

కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినవారి రక్త నమూనాలను హెచ్‌1ఎన్‌1 (H1N1) లేదా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కోసం లేబొరేటరీలకు పంపుతున్నట్టు సమాచారం. ‘ఇన్‌ఫ్లూయెంజా కేసులు (influenza cases) దేశంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. దాదాపు వారం పాటు ఆ లక్షణాలు కొనసాగుతున్నాయి. రోగిని పెద్దగా ప్రభావితం చేయకపోయినా, మరణాలు లేకపోయినా, హాస్పిటలైజేషన్‌ అవసరం లేకపోయినా.. సదరు లక్షణాలు బయటపడిన వ్యక్తి రెండు నుంచి మూడు వారాల పాటు బాధపడుతున్నారు. ఈ కోణంలో ప్రభుత్వం దీనిపై పరిశోధనలు చేయించాలి. ఈ అంశంపై ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడుతున్నాం’ అని ప్రభుత్వ సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

వాతావరణ మార్పులతో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని, వీటిలో అడెనో వైరస్‌ (adeno virus), పారా ఇన్‌ఫ్లూయెంజా para influenza) ప్రధానంగా కనిపిస్తున్నాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు, ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని, కానీ తగిన పరిశీలన చేసి కానీ ఏది అనేది ధృవీకరించుకోలేమని ఆయన అన్నారు. అయితే.. హాస్పిటళ్లపై భారం లేకపోవడం ఊరటనిచ్చే పరిణామమని పేర్కొన్నారు.

ఐసీఎంఆర్‌ (ICMR) చెప్పే లెక్కల ప్రకారం చూస్తే హెచ్‌3ఎన్‌2 (H3N2) అనే సబ్‌టైప్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ గత రెండు మూడు నెలల నుంచి వ్యాప్తి చెందుతున్నది.

తాజా కేసులలో దీర్ఘకాలిక అస్వస్థత, నిరంతర దగ్గు, జ్వరం కనిపిస్తున్నాయి. అయితే.. గత రెండేండ్లుగా కొవిడ్‌ సృష్టించి విలయం నేపథ్యంలో సాధారణంగానే కొంత భయం నెలకొంటున్నది. అయితే.. ప్రస్తుతం విస్తరిస్తున్న స్ట్రెయిన్‌ మరణాలకు దారి తీసేది కాదని వైద్యులు అభయమిస్తున్నారు.

తగిన వైద్య సలహా తీసుకోవాలని, సొంత వైద్యం, మితిమీరిన యాంటిబయాటిక్స్‌ వాడకం తగదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) స్పష్టం చేసింది. వైద్యులు కూడా లక్షణాలు తగిన వైద్యం (symptomatic treatment ) అందించాలని, అంతేకానీ యాంటిబయాటిక్స్‌ (antibiotics) సూచించవద్దని తెలిపింది.

Exit mobile version