Site icon vidhaatha

Dimer Khichuri | మీకు ‘డిమెర్‌ కిచురి’ అనే టేస్టీ వంటకం తెలుసా.. నిమిషాల్లో రెడీ చేసుకోండిలా..

Dimer Khichuri : డిమెర్‌ కిచురి (Dimer Khichuri)..! ఇది బెంగాళీ స్పెషల్‌ వంటకం..! డిమెర్‌ కిచ్డీ అంటే కోడిగుడ్డుతో కిచ్డీ అని అర్థం..! ఇంకా సరళంగా చెప్పుకోవాలంటే ‘ఎగ్‌ కిచ్డీ (Egg Kichidi)’ అన్నమాట. మరి ఈ ఎగ్‌ కిచ్డీని మీరెప్పుడైనా టేస్ట్‌ చేశారా..? చేయకపోతే ఇప్పుడు చేయండి. దీని తయారీకి పెద్దగా సమయం కూడా పట్టదు. కేవలం పదంటే పదే నిమిషాల్లో ఈ ‘ఎగ్‌ కిచ్డీ’ రెడీ అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం..? ఇప్పుడే ట్రై చేద్దాం..

కావాల్సిన పదార్థాలు

డిమెర్‌ కిచురి కోసం పెసరపప్పు ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, పసుపు సగం టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నీళ్లు 6 కప్పులు, వేడినీళ్లు ఒకటిన్నర కప్పు, సోయా చంక్స్‌ పావు కప్పు, ఆలుగడ్డ ఒకటి, కోడిగుడ్లు రెండు కావాలి. అదేవిధంగా తాళింపు కోసం.. నూనె 8 టేబుల్ స్పూన్‌లు, ఎండు మిరపకాయలు 5, బిర్యానీ ఆకులు 2, సోంపు సగం టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, అల్లం తురుము పావు టేబుల్ స్పూన్, పచ్చిమిర్చీలు 3, కొత్తిమీర కొద్దిగా రెడీ చేసి పెట్టుకోవాలి.

తయారీ విధానం

ముందుగా సోయచంక్స్ ను వేడి నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డ తొక్క తీసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పును, బియ్యాన్ని విడివిడిగా వేపుకుని, తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కడిగిన పప్పు, బియ్యాన్ని కుక్కర్‌లో వేసి, కోసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె, ఆరు కప్పుల నీళ్లు వాటికి కలుపాలి. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాక ఉడికించాలి.

ఇక కుక్కర్‌లోని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మెత్తగా ఉడికిన కిచ్డీలో నుంచి ఆలుగడ్డ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, కొన్ని వేడి నీళ్లు పోసి, ఉడికిన అన్నం మిశ్రమాన్ని మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు ఇంకో పాత్రలో రెండు టేబుల్ స్పూన్‌ల నూనె వేసి, రెండు గుడ్ల సొనను బాగా గిలకొట్టి నూనెలో పోసుకోవాలి. ఉడికిన గుడ్ల సొనపై చిటికెడు ఉప్పు వేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, సోంపు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. వేగిన తాళింపులో అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకుని వేపుకోవాలి.

ఇప్పుడు వేడినీళ్లలో నానబెట్టుకున్న సోయాలోని నీళ్లను పిండేసి, మూకుడులోని మిశ్రమానికి ఆ సోయాను కలిపి వేపుకోవాలి. ఇలా వేగిన సోయాలో అప్పటికే వేపుకున్న గుడ్డు ముక్కలు వేసి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న మిశ్రమాన్ని అంతకుముందే ఉడికించి పెట్టుకున్న కిచ్డీలో వేసి కలిపేసుకోవాలి. అంతే ‘డిమెర్‌ కిచురి’ రెడీ. చివరగా కొత్తిమీర, పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కలుపుకుని వడ్డించుకోవడమే..!

Exit mobile version