ఈ ఎక్సర్‌సైజులతో వయసు రివర్స్‌!.. నిండు నూరేళ్లూ నిత్య యవ్వనం

ఆయన వయసు 85 ఏళ్లు, కానీ ఆయన మెదడుకు మాత్రం అరవై అయిదేళ్లే. నలభయ్యేళ్లు రాగానే ఇక వయసైపోయిందనుకుంటాం. కానీ 85 ఏళ్ల వయసులో కూడా 150 పుషప్స్‌ను అలవోకగా చేసేయగలరాయన

  • Publish Date - November 26, 2023 / 11:38 AM IST

విధాత: ఆయన వయసు 85 ఏళ్లు, కానీ ఆయన మెదడుకు మాత్రం అరవై అయిదేళ్లే. నలభయ్యేళ్లు రాగానే ఇక వయసైపోయిందనుకుంటాం. కానీ 85 ఏళ్ల వయసులో కూడా 150 పుషప్స్‌ను అలవోకగా చేసేయగలరాయన. డీఎన్‌ఏ, పెప్‌టైడ్లను తయారుచేసే యంత్రాలు, డీఎన్ఏ, ప్రొటీన్లను సీక్వెన్స్ చేయగల యంత్రాలను తయారుచేసి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు పునాది వేశారు డాక్టర్ లిరాయ్ హుడ్. శారీరక వ్యాయామం, ట్రెయిన్ ఎక్సర్‌సైజ్‌లు, మంచి ఆహార విధానాల ద్వారా నిండునూరేళ్లూ, ఆరోగ్యంగా, వయసు పెరగకుండా బతికేయొచ్చంటున్నారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో బయోబ్యాంక్‌ను ప్రారంభించడానికి ఇటీవల ఇండియా వచ్చిన డాక్టర్ లెరోయ్ హుడ్ ముఖాముఖి.

  • డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ ద్వారా మ్యుటేట్ అయిన జన్యువులను గుర్తించి, ఆ జన్యువులే ఫలానా వ్యాధికి కారణమవుతాయని ముందే కనుక్కోగలుగుతారా? ఆ ప్రాసెస్ ఏంటి?

మ్యుటేషన్లు లేదా జన్యుమార్పులు సింగిల్ జీన్ లేదా పాలీ జీన్ అని రెండు రకాలుగా జరుగుతాయి. సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి వ్యాధులు సింగిల్ జీన్ మ్యుటేషన్ వల్ల వస్తాయి. స్కిజోఫ్రినియా, అల్జీమర్స్, డయాబెటిస్ లాంటివి పాలీజీన్ అంటే ఒకటి కంటే ఎక్కువ జన్యువుల్లో మార్పుల వల్ల వస్తాయి. సింగిల్ జీన్ మ్యుటేషన్లు ఉన్నప్పుడు క్రిస్పర్ జీన్ టెక్నాలజీ ద్వారా చెడిపోయిన జన్యువును తీసేసి, దాని స్థానంలో కొత్త జన్యువును పెట్టడం సాధ్యమవుతుంది.


జంతువులపై చేసిన అధ్యయనంలో ఇది సక్సెస్ అయింది. దీనికి రెండేళ్ల క్రితం నోబెల్ కూడా వచ్చింది. అయితే ఈ చికిత్స వివాదస్పదమయింది. దీనిలోని ఎథికల్, మోరల్ అంశాల వల్ల ఇది వెంటనే అందుబాటులోకి రాలేకపోయింది. కానీ రాబోయే పదేళ్లలో ఈ టెక్నాలజీ ద్వారా సింగిల్ జీన్ మ్యుటేషన్ల సమస్యలను అధిగమించగలం. కానీ పాలీజీన్ మ్యుటేషన్ల వల్ల వచ్చే వ్యాధుల విషయంలోనే కొంచెం కష్టం. ఎందుకంటే ఇలాంటి వ్యాధుల్లో జన్యువులే కాకుండా ఎన్విరాన్ మెంట్, గట్ మైక్రోబయోమ్ (జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు) అన్నీ పాత్ర వహిస్తాయి. కాబట్టి వీటి విషయంలో ఏమైనా చేయొచ్చా అనేది అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

  •  అంటే సింగిల్ జీన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల విషయంలో జీన్ థెరపీ సక్సెస్ అయినట్టేనా?

కొంతవరకు. కానీ దానికి ఉన్న పరిమితులను అధిగమించి అందుబాటులోకి రావాలంటే కనీసం ఐదు పదేళ్లు ఆగాల్సిందే.

  • పాలీజెనిక్ సంబంధిత వ్యాధుల్లో జన్యువులు కాకుండా ఇతర అంశాలను మనం ఎలా మార్చగలమంటారు?

వీటిలో ప్రధానంగా మూడు అంశాలుంటాయి. మైకోబయోమ్, ఎన్విరాన్మెంట్, ట్రెయిన్. పాలీజెనిక్ మ్యుటేటెడ్ వ్యాధుల్లో చాలావరకు వయసు పెరిగిన కొద్దీ వచ్చేవే. అయితే మెదడుకు చేసే కొన్ని ఎక్సర్‌సైజుల ద్వారా ఏజింగ్‌ని కంట్రోల్ చేయవచ్చు. ఈ ట్రెయిన్ ఎక్సర్‌సైజుల ద్వారా వయసును రివర్స్ కూడా చేయవచ్చు.

  • ఆ ఎక్సర్‌సైజులు ఏమిటి, ఎలా చేయాలి?

సాధారణంగా 30 ఏళ్ల వయసు నుంచి మెదడు పనితీరు మందగించడం ప్రారంభం అవుతుంది. మన ఓవరాల్ వయసే కాకుండా, ట్రెయిన్ ఏజ్ కూడా ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా కనుక్కోవచ్చు. దాన్ని రివర్స్ చేయడం కూడా సాధ్యమే. 80 ఏళ్ల వాళ్లను 30 ఏళ్లకి మార్చవచ్చు.

దీనికి సింపుల్ ఎక్సర్‌సైజు డ్రైవింగ్. టూవీలర్ గానీ, కారు గానీ నడిపేటప్పుడు ఎదురుగానే కాకుండా ఇరుపక్కల కూడా చూస్తాం. ఇలా కళ్లకు పక్కవైపు నుంచి చేరే ప్రతిబింబాల వల్ల మెదడు స్టిమ్యులేట్ అవుతుంది. అందువల్ల వయసు పెరిగిన తరువాత డ్రైవ్ చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నడిచేటప్పుడు కూడా ఎదురుగా మాత్రమే కాకుండా అన్ని పక్కల చూస్తూ ఉంటే, మెదడు యాక్టివేట్ అవుతుంది. రోజంతా మెదడుకు పని చెప్తూ చురుగ్గా ఉంచుకుంటే దాని వయసును కంట్రోల్ చేయవచ్చు.

  • మెదడు బాగా పనిచేయగలిగితే శారీరక ఆరోగ్యం పైనా సానుకూల ప్రభావం ఉంటుందా?

రోజూ మనం శారీరక వ్యాయామాలు చేస్తూ ఉంటే గుండె లాంటి అవయవాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి, అవి ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా మెదడుకు కూడా ఆక్సిటన్ పెరిగి, దాని చురుకుదనం పెరుగుతుంది. కాబట్టి మెదడు బాగా పనిచేయాలంటే శారీరక వ్యాయామం కూడా ముఖ్యమే. పెద్ద వయసువాళ్లు రెగులర్ గా వ్యాయామం చేస్తే వాళ్ల మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. నేను రోజుకి 150 పుషప్స్ చేస్తాను. బహుశా అందుకేనేమో, 80 ఏళ్ల వయసులో కూడా నా ట్రెయిన్ ఏజ్ 60 ఏళ్లు గానే ఉంది.

  •  సాధారణంగా ఎలాంటి వ్యాయామాలను మీరు సూచిస్తారు?

మన వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగా మూడు రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేయాలి. పుషప్స్ ద్వారా మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి, చురుగ్గా పనిచేస్తుంది. స్ట్రెచింగ్స్ ద్వారా బ్యాలెన్స్ మెయిన్‌టెన్‌ అవుతుంది. ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలూ అవసరం. వీటితోపాటు సరైన డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం.

  • ఇప్పుడు రకరకాల డైట్ ల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎలాంటి డైట్ మంచిదంటారు?

మనం తీసుకునే ఆహారంలో రెండు రకాల విషయాలను చూసుకోవాలి. ఏ రకమైన డైట్, ఏ విధానంలో తీసుకుంటున్నామనేది కీలకం.

మెడిటిరేనియన్ డైట్ ఎవరికైనా ప్రయోజనకరమైందే. నేను మాత్రం ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్ పాటిస్తాను. అంటే 16 గంటల పాటు ఫాస్టింగ్‌లో ఉండాలన్నమాట. మిగిలిన 8 గంటల సమయంలో ఏమైనా తినొచ్చు. నేను పొద్దున కాఫీ తాగుతాను. మధ్యాహ్నం పూట కూరగాయల ముక్కలు, నట్స్ ఎక్కువ తీసుకుంటాను. రాత్రిపూట భోజనం మాత్రం మంచిగా తింటాను. కానీ మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ చేయను. అంటే ముందురోజు రాత్రి డిన్నర్‌కు, తరువాతి రోజు మధ్యాహ్నం లంచ్‌కి మధ్య 16 గంటలు ఫాస్టింగ్ అన్నమాట. దీనివల్ల బరువు సులువుగా తగ్గుతారు. హెల్దీ మెటబాలిజమ్ ఉంటుంది.

  • పర్సనలైజ్డ్ మెడిసిన్ గురించి మీరేం చెప్తారు? యుఎస్‌లో ఇది ఎంతవరకు సక్సెస్ అయింది?

ఇక భవిష్యత్తంతా దీనిది. ఫార్మకోజీనోమిక్స్ ఆధారంగా వ్యక్తిగతమైన చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు పీనోమ్ అనేది కొత్త కాన్సెప్ట్. జీనోమిక్ (జన్యుతత్వం), ఎన్విరాన్మెంటల్ కారకాలను కలిపి పరిగణించేదే ఫీనోమ్. పీనోమిక్ మెజర్‌మెంట్‌ ఆధారంగా పర్సనలైజ్డ్ మెడిసిన్ ఉంటుంది. యుఎస్‌లో ఇది బహుళ ప్రాచుర్యంలో ఉంది. వచ్చే పదేళ్లలో మెడిసిన్ అర్థాన్నే ఇది మార్చేయగలదు.

  • అయిదేళ్ల ముందే డయాబెటిస్‌ను, పదేళ్ల ముందే క్యాన్సర్‌ను కనిపెట్టవచ్చంటున్నారు కదా. అంటే, జన్యువుల్లో వచ్చిన మార్పులను బట్టి చెప్తారా? దాని ఆధారంగానే చికిత్స ఉంటుందా? మెడిసిన్లో మార్పులు ఎలా ఉంటాయి?

ప్రిడిక్షన్, ప్రివెన్షన్, పర్సనలైజ్డ్, పబ్లిక్ పార్టిసిపిషన్ అనే నాలుగు అంశాల ఆధారంగా ఇది సాధ్యమవుతుంది. జన్యువుల్లో మార్పులను కనుక్కున్నంత మాత్రాన వాటిన మార్చలేం. డయాబెటిస్ లాంటివి పాలీజెనిక్ వ్యాధులు. కాబట్టి బయో బ్యాంకులో సికరించిన శాంపిళ్లను పదేళ్ల తర్వాత అధ్యయనం చేసి, అప్పుడు వాళ్లకు ఉన్న వ్యాధులకు ఏయే మార్పులు కారణమయ్యాయో తెలుసుకుంటాం. దాన్ని బట్టి ఆ మార్పులు ఈ వ్యాధులకు ఏ మేరకు కారణమవుతాయో తెలుస్తాయి. ఈ మార్పులను పదేళ్లకు ముందే పరిశీలించగలిగితే ఏయే వ్యాధులు వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో ముందే తెలుస్తుంది. అంటే ఇప్పుడు చేసిన అధ్యయనం, తరువాతి తరం వాళ్లకు వచ్చే వ్యాధులను ముందే అంచనా వేసేందుకు తోడ్పడుతుంది. అలా ముందే అంచనా వేయడం వల్ల ఆయా వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్తపడవచ్చు.

  • క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో ఇదెలా ఉపయోగపడుతుంది?

హెల్త్ కేర్ కోసం యుఎస్ 4.4 బిలియన్ డాలర్లను ఖర్చుపెడుతున్నది. దీంట్లో 85 శాతం క్రానిక్ వ్యాధుల కోసమే ఖర్చు చేస్తోంది. కాబట్టి ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తేవడం సులువు. క్యాన్సర్ విషయానికి వస్తే… రొమ్ము, పాంక్రియాస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల వంటి వాటికి ఇమ్యునోథెరపీ ద్వారా కొత్త మందులను రెడీ చేయవచ్చు. ఈ కాన్సెప్ట్ ద్వారా కణ స్థాయిలో ఉన్నప్పుడే క్యాన్సర్ ని కనిపెట్టవచ్చు. రిస్కును అంచనా వేయవచ్చు. అలా అల్జీమర్స్, డయాబెటిస్, గుండె జబ్బులను కూడా ఈ కాన్సెప్ట్ ద్వారా పూర్తిగా నివారించొచ్చు.

ఇంటర్వ్యూ : రచన ముడుంబై

Latest News