Health tips | గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మీ వంటలో ఈ మార్పు చేయాల్సిందే..!

  • Publish Date - March 5, 2024 / 03:14 AM IST

Health tips: ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిలో చాలా మరణాలకు రక్తంలో కొవ్వు పేరుకుపోవడమే ప్రధాన కారణం అవుతోంది. మరి రక్తంలో కొవ్వు పేరుకోకూడదు అంటే మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మన వాడే వంట నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం కచ్చితంగా మనం ఇంట్లో ఏ వంట నూనె ఉపయోగిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అదేవిధంగా నూనె రకం ఏదైనా సరే దాన్ని ఎక్కువగా వినియోగించడం కూడా మన గుండె ఆరోగ్యానికి కీడు చేస్తుంది. నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సిరల్లో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ముందుగా అధిక రక్తపోటు వచ్చి ఆ తర్వాత గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ డిసీజ్‌, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్లకు దారి తీస్తుంది. కాబట్టి మనం వంట నూనె రకంపైన మాత్రమేగాకుండా వంటల్లో వినియోగించే నూనె మోతాదు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కొన్ని మేలైన వంట నూనెలను మాత్రమే వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె విషయంలో వంటలో మార్పు చేయకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని నూనెలు చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడతాయని, వాటిని తీసుకోవడంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. వేరుశెనగ నూనెతో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని అంటారు. కానీ ఇది అపోహ అని నిపుణులు అంటున్నారు.

వేరుశనగ నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. వేరుశనగ నూనెలో విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్ అధిక మొత్తంలో ఉంటాయి. అయితే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు నెలల తరబడి ఒకే నూనెను కాకుండా.. రెండు నెలలకు ఒకసారి నూనె రకాన్ని మారిస్తే బాగుంటుంది. అదేవిధంగా అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అవిసె నూనెను వంటల్లో వాడితే శరీరంలో కొలెస్ట్రాల్‌తోపాటు మంటను తగ్గుతుంది. అయితే అవిసె నూనెను అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించినా, ఫ్రిజ్‌లో పెట్టి కూల్‌ చేసినా దాని సహజ లక్షణాన్ని కోల్పోతుంది. కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు.

ఆలివ్‌ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మన దేశంలో ఆలివ్ నూనె ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానిని మధ్యప్రాచ్యం, మధ్యధరా దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారత్‌లో ఆలివ్‌ నూనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమతను బట్టి అరుదుగానైనా ఆలివ్‌ నూనెను వంటలో భాగం చేసుకోవడం ముఖ్యం. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె ఉంటాయి. అంతేగాక ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది.

Latest News