Egg for diabetics | కోడిగుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందా..?

Egg for diabetics : కోడి గుడ్డు ప్రపంచ దేశాల్లో చాలా మంది ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒక‌టి నుంచి రెండు గుడ్లు తిన‌డం మంచిద‌ని చెబుతుంటారు. కానీ, ఒక ప‌రిశోధ‌నలో మాత్రం గుడ్లు ఎక్కువ‌గా తింటే మ‌ధుమేహం బారిన‌ప‌డే ప్రమాదం ఉంద‌ని తేలింది. ఎవ‌రైతే రోజుకు ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ గుడ్లు తింటారో వారిలో మ‌ధుమేహం రిస్క్‌ పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌కులు వెల్లడించారు. అంతేగాక పురుషుల్లో కంటే మ‌హిళల్లో […]

  • Publish Date - March 17, 2024 / 04:42 PM IST

Egg for diabetics : కోడి గుడ్డు ప్రపంచ దేశాల్లో చాలా మంది ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒక‌టి నుంచి రెండు గుడ్లు తిన‌డం మంచిద‌ని చెబుతుంటారు. కానీ, ఒక ప‌రిశోధ‌నలో మాత్రం గుడ్లు ఎక్కువ‌గా తింటే మ‌ధుమేహం బారిన‌ప‌డే ప్రమాదం ఉంద‌ని తేలింది. ఎవ‌రైతే రోజుకు ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ గుడ్లు తింటారో వారిలో మ‌ధుమేహం రిస్క్‌ పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌కులు వెల్లడించారు. అంతేగాక పురుషుల్లో కంటే మ‌హిళల్లో ఈ రిస్క్ ఎక్కువ‌ని తెలిపారు.

18 ఏండ్ల ప‌రిశోధ‌న‌

చైనాలో అతిగా గుడ్లను ఆహారంగా తీసుకుంటుండ‌టంపై యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నేతృత్వంలో చైనా మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ, ఖ‌తార్ యూనివ‌ర్సిటీ సంయుక్తంగా 18 ఏండ్ల పాటు అధ్యయ‌నం చేశాయి. టైప్-2 మ‌ధుమేహం కేసులు రోజురోజుకు పెరగడానికి మ‌న‌ ఆహార‌పు అల‌వాట్లే ప్రధాన కార‌ణమ‌ని ప‌రిశోధ‌కుడు మింగ్ లీ పేర్కొన్నారు. చైనీయులు గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా త‌మ సంప్రదాయ ఆహార‌ప‌దార్థాలైన ధాన్యాలు, కూర‌గాయల‌కు దూర‌మ‌వుతూ క్రమంగా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు అల‌వాటుప‌డ్డారని, చైనాలో మ‌ధుమేహులు పెరగ‌డానికి ఇది కార‌ణ‌మ‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు.

రోజుకు 50 గ్రాములు మించొద్దు

ప్రాసెస్డ్ ఫుడ్స్‌తోపాటు అతిగా గుడ్లను వినియోగించ‌డం కూడా టైప్‌-2 మ‌ధుమేహుల సంఖ్య పెరగడానికి కార‌ణ‌మవుతున్నదని వారి 18 ఏండ్ల ప‌రిశోధ‌న‌లో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ 18 ఏండ్ల కాలంలో చైనాలో గుడ్ల వినియోగం రెండింత‌లయ్యింద‌ని తెలిపారు. త‌ర‌చూ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో మ‌ధుమేహం రిస్క్ పెరుగుతున్నట్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవ‌ల్స్ ఎక్కువగా ఉంటున్నట్లు తేలింద‌ని పేర్కొన్నారు. రోజూ 50 గ్రాముల కంటే త‌క్కువగా గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో 25 శాతం, రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ‌ గ‌డ్లు తినేవారిలో 60 శాతం మ‌ధుమేహం రిస్క్ పెరుగుతుంద‌ని నిర్ధారించారు. ‘చైనా హెల్త్ అండ్ న్యూట్రిష‌న్ స‌ర్వే’ పేరుతో జరిగిన తమ ప‌రిశోధ‌నలో స‌గ‌టున 50 ఏండ్ల వ‌య‌సున్న 8,545 మంది పాల్గొన్నార‌ని మింగ్ లీ చెప్పారు.

గుడ్లను ఎలా తినాలి..?

మ‌ధుమేహం వ్యాధి బారిన‌ ప‌డ‌కుండా ఉండాలంటే గుడ్లను ఉడ‌క‌బెట్టుకుని మాత్రమే తిన‌డం ఉత్తమ‌మ‌ని, దానికి ఉప్పు, కారం, కొత్తిమీర లాంటివి జోడించి తీసుకోవాల‌ని మింగ్‌ లీ సూచించారు. లేదంటే గుడ్లను కూరగాయలతో కలిపి తీసుకోవాలని సలహా ఇచ్చారు. గుడ్లతో వెజిటెబుల్ ఆమ్లెట్‌లు లాంటివి చేసుకోవాలన్నారు. గుడ్లను నేరుగా కాకుండా కూర‌గాయ‌లతో క‌లిపి తీసుకోవ‌డం ద్వారా మధుమేహం రిస్క్ త‌క్కువ‌న్నారు. గుడ్లతో చేసుకునే డిష్‌ల‌లో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడ‌కూడదని హెచ్చరించారు. 

Latest News