- వానలు తగ్గుముఖం – వ్యాధుల విజృంభణం
- మలేరియా, డెంగీ, టైఫాయిడ్, కలరాల ప్రమాదం
- దోమల దాడిని అరికట్టడం ముఖ్యం
- బయటి తిండి అసలే తినొద్దు
Seasonal Diseases | దేశమంతటా ఇప్పుడు వానలు జోరుగా కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నీటి గుంటలే. ఈ సమయంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది. నీరు నిల్వ ఉండటం, వెలుతురు తగ్గిపోవడం, శుభ్రత లోపించడం వంటి కారణాల వల్ల దోమలు, శిలీంద్రాలు, వైరస్‌లు, బాక్టీరియా చాలా వేగంగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా వర్షాకాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ, జలుబు, ఫ్లూ, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి.
డెంగీ ముఖ్యంగా ఈడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల వస్తుంది. ఈ దోమ నిల్వ నీటిలో పెరుగుతుంది. అకస్మాత్తుగా జ్వరం రావడం, కండరాలు మరియు కీళ్ల నొప్పి, కళ్ల వెనుక నొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదిస్తే దీన్ని నియంత్రించవచ్చు. మలేరియా అనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తిస్తుంది. చలి పట్టు, జ్వరం తిరగబెట్టడం, చెమటలు, అలసట, తలనొప్పి ఇవి మలేరియా యొక్క ప్రధాన లక్షణాలు. నీటి గుంతలు, మురుగు కాలువలు దోమల పెరుగుదలకు ప్రధాన కేంద్రాలవుతాయి కాబట్టి వర్షాకాలంలో మలేరియా ఎక్కువగా వస్తుంది.
అదే సమయంలో వర్షాకాలం ప్రారంభంలోనే జలుబు, ఫ్లూ కేసులు కూడా పెరుగుతాయి. దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. తడి వాతావరణం, వర్షంలో తడవడం ఇవన్నీ దీనికి కారణమవుతాయి. మరో సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్లు. పాదాల వేళ్ల మధ్య చర్మం ఊడిపోవడం, దురద, ఎర్రటి మచ్చలు, గోర్ల రంగు మారడం, నోటిలో తెల్లటి మచ్చలు కనిపించడం ఇవి ఈ సమస్య యొక్క ముఖ్య లక్షణాలు.
జ్వరం ఎక్కువ రోజులు తగ్గకపోతే, తీవ్రమైన వాంతులు లేదా విరేచనాలు వచ్చినా, అలసట ఎక్కువగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండి, కళ్లు పసుపు రంగులోకి మారితే, రక్తస్రావం జరిగినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. సొంతంగా మందులు వేసుకోవడం, అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడటం చాలా ప్రమాదకరం. ఇది ఔషధ నిరోధకతకు దారితీస్తుంది. కాబట్టి వర్షాకాలంలో వ్యాధులు కనపడగానే వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
వర్షాకాలం మనందరికీ ఆనందం కలిగించినా, అదే సమయంలో ఆరోగ్యానికి ప్రమాదకర కాలం కూడా. కాబట్టి సీజన్‌కు తగ్గ జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పరిశుభ్రత, సురక్షిత నీరు, దోమల నియంత్రణ, సమయానికి టీకాలు ఇవన్నీ ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సినవి.