మేలుకో మిత్రమా.. ఇది నీ హక్కు!

స‌మంత‌, నాగ‌చైత‌న్య‌తో ఎందుకు విడిపోయింది..? న‌య‌న‌తార స‌రొగ‌సీ కి వెళ్లిందా....?

  • Publish Date - April 7, 2024 / 09:06 AM IST

స‌మంత‌, నాగ‌చైత‌న్య‌తో ఎందుకు విడిపోయింది..? న‌య‌న‌తార స‌రొగ‌సీ కి వెళ్లిందా….? అబ్బో… ఇవి వార్త‌లు కావు… ఎంతోమందికి మాన‌సిక సంతోషాన్నిచ్చే పోష‌కాలు.

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కు పుట్ట‌బోయేది అమ్మాయా… అబ్బాయా….. ఊపిరి బిగ‌బ‌ట్టి ఎదురుచూసి, తెలుసుకోవాల్సిన విష‌యం..!

టీవీల్లోనో, యూట్యూబుల్లోనో వచ్చే చవకబారు వార్తల మసాలాలు కావాలి….. ఎవ‌రు ఎవ‌రితో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నారో వెంట‌నే తెలియాలి. తీసుకున్న ఆహారం క‌న్నా ఎక్కువ ఎన‌ర్జీ ఇచ్చే విష‌య‌మిది.

ప‌క్కింటివాళ్లు, ఎదురింటి వాళ్లు, ఆ ఊరివాళ్లు, ఈ ఊరి వాళ్లు… వాళ్ల వ్య‌క్తిగత విష‌యాలు….. ఇవ‌న్నీ స‌రే. మ‌రి మీ గురించి, మీ శ‌రీరం గురించి మీకు తెలుసా?

డాక్ట‌ర్ వైద్యం స‌రిగా చేయ‌లేద‌ని విరుచుకుప‌డ‌తాం. హాస్పిట‌ల్స్ మ‌న డ‌బ్బుల‌న్నీ దండుకుంటున్నాయ‌ని పోరాటం చేస్తాం. అస‌లు వైద్య రంగం వ్యాపారం అయిపోయింద‌నీ, మ‌న‌కు అందించే చికిత్స మీద క‌న్నా వాళ్ల‌కు డ‌బ్బు సంపాద‌న మీదే మ‌క్కువ అని ర‌క‌ర‌కాలుగా మ‌న అభిప్రాయాల‌ను నొక్కి చెబుతుంటాం.

నిజ‌మే..! కొన్ని హాస్పిట‌ల్స్ బిల్లింగ్స్ విష‌యంలో నిర్ద‌య‌గా ఉంటున్నాయి. కొంద‌రు డాక్ట‌ర్లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మూ చూస్తున్నాం.

కానీ… ఏ పాపం చేయ‌ని వాడు ముందుగ రాయి విస‌రాలి…. అన్న‌ట్టుగా…

మ‌న మీద మ‌న‌కే ప్రేమ లేక‌పోతే ప‌క్కోడికి మ‌న మీద క‌న్స‌ర్న్ ఎందుకుంటుంది?

మ‌న శ‌రీరం గురించి, మ‌న ఆరోగ్యం గురించి మ‌న‌కే శ్ర‌ద్ధ లేన‌ప్పుడు అవ‌త‌లివాళ్ల‌కు ఎందుకుంటుంది?

మ‌నం రోగం తెచ్చుకుంటేనే క‌దా… హాస్పిట‌ల్స్ కి ల‌క్ష‌లు సంపాదించుకునే అవ‌కాశం క‌లిగేది….

మ‌న‌మేమో…. ప్ర‌పంచంలోని ఇత‌ర వ్య‌క్తుల జీవితాల‌లోకి తొంగి చూడ‌టంలో బిజీ ఉన్నాం క‌దా. మ‌రి మ‌న ఆరోగ్యం గురించి ప‌ట్టించుకునేవాళ్లెవ‌రు?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో 4.5 బిలియ‌న్ల మందికి ఆరోగ్య భ‌ద్ర‌త లేదు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ లెక్క‌ల ప్ర‌కారం 2000 నుంచి 2019 మ‌ధ్య నాన్ క‌మ్యూనికేబుల్ డిసీజెన్ అంటే డ‌యాబెటిస్‌, గుండెజ‌బ్బులు, క్యాన్స‌ర్ల వంటి లైఫ్ స్ట‌యిల్ వ్యాధుల వ‌ల్ల మ‌ర‌ణించే వారి సంఖ్య 21 మిలియ‌న్ల నుంచి 41 మిలియ‌న్ల‌కు పెరిగింది. అంటే ప్ర‌తి 4గురిలో ఒక‌రు వీటివ‌ల్ల చ‌నిపోతున్నారు.

ఒక్క 2019 సంవ‌త్స‌రంలోనే…. గుండెజ‌బ్బుల వ‌ల్ల 17.9 మిలియ‌న్లు, క్యాన్స‌ర్ వ‌ల్ల 9.3 మిలియ‌న్లు, క్రానిక్ రెస్పిరేట‌రీ డిసీజ్ వ‌ల్ల 4.1 మిలియ‌న్లు, డ‌యాబెటిస్ వ‌ల్ల 2 మిలియ‌న్ల మంది చనిపోయార‌ని డ‌బ్ల్యుహెచ్‌వో లెక్క‌లు చెబుతున్నాయి.

మ‌న దేశంలో నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ వ‌ల్ల మ‌ర‌ణించేవాళ్లు 2020లో 63 శాతం ఉండ‌గా 2022 కి ఈ మ‌ర‌ణాల శాతం 66కి త‌గ్గింది.

ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ “My health, my right,”. నాణ్యమైన వైద్యం అందుకోగలగడం మన హక్కు. ప్రతీ చోటా, ప్రతీ వ్యక్తి ఆరోగ్యంగా జీవించగలిగే అవకాశాన్ని కలిగి ఉండాలనే విషయం పైన ఫోకస్ చేయాలంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ఇందులో డాక్టర్లు, hospitals, ఇతర వైద్య రంగ నిపుణులకు ఎంత పాత్ర ఉందో.. అంతా కన్నా ముఖ్యమైన పాత్ర మనదే.

కొత్త రోగాలూ, కొత్త చికిత్సల గురించి డాక్టర్ లూ, సైంటిస్టు లూ చూసుకుంటారు. అసలు రోగాల బారిన పడకుండా, మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలో మనం చూసుకుందాం.

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మన శరీరంలో వచ్చే రోగాల్ని జయించడానికి ప్రాధాన్యం ఇద్దాం. మరి ఇందుకోసం ఏం చేయాలి?

సినిమా లలో హీరోలు, హీరోయిన్లను చూసి అలవాటు చేసుకున్న సిగరెట్ లు, ఆల్కహాల్స్ మానేద్దాం.

పక్కవాడి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడకుండా మన వ్యక్తిగత శరీరం గురించి మనం చూసుకుందాం.

తెల్లవాళ్ళు తినేవన్నీ తింటేనే నాగరికత అనే భ్రమ నుండి బయటపడి పిజ్జా లు, బర్గర్ లు, కోక్ లు మానేద్దాం.

టివి లు, mobiles కి అతుక్కుపోకుండా ఒళ్ళు వంచి శారీరక శ్రమ చేద్దాం.

ఎంజాయ్ చేయాలన్నాహెల్త్ ఉండాలి కదా. డబ్బు, సక్సెస్.. రావాలంటే.. ఊరికినే రావు కదా. వాటి కోసం పని చేయడానికి మన ఆరోగ్యం బాగుండాలి కదా. ఆరోగ్యమే మహా భాగ్యం.. ఆరోగ్యమే మహా విజయం.

-రచన ముడుంబై

Latest News