మెదడు చురుగ్గా పనిచేస్తుందని దమ్ముకొట్టేవారి కోసమే ఈ న్యూస్‌!

ధూమపానం వల్ల ఊపిరితిత్తులు చెడిపోవడం, క్యాన్సర్‌ రావడమే కాదు.. మరో ప్రమాదం కూడా ఉన్నదని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు.

  • Publish Date - December 26, 2023 / 01:05 PM IST

లండన్‌: దమ్ముకొడితే క్యాన్సరొచ్చి పోతారనేది రోజూ చూసే హెచ్చరిక! ఊపిరితిత్తులు చెడిపోతాయనీ తెలుసు!! కానీ.. పొగరాయుళ్లు మాత్రం మైండ్‌ పని చేయాలంటే ఒక దమ్ము పీకాల్సిందేనంటుంటారు! అయితే.. శాస్త్రవేత్తలు.. ఇటువంటివారీ గట్టివార్నింగ్‌ ఇస్తున్నారు. సిగరెట్లు తాగడం వల్ల ఇతర సమస్యలతోపాటు.. మెదడు కుంచించుకుపోయే ప్రమాదం ఉన్నదట! దాని వల్ల డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి రోగాలబారిన పడతారని శాస్త్రవేత్తలు వార్నింగ్‌ ఇస్తున్నారు. ఈ మేరకు ఒక తాజా అధ్యయనాన్ని బయోలాజికల్‌ సైకియాట్రి: గ్లోబల్‌ ఓపెన్‌ సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.


మిస్సోరి, నార్త్‌ కరోలినాకు చెందిన శాస్త్రవేత్తల బృందం పొగతాగేవారి మెదడులో కలిగే మార్పులపై అధ్యయనం చేసింది. ఇందుకోసం 32వేల మంది యూరోపియన్‌ పొగరాయుళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించారు. పొగ తాగడం వల్ల మెదడు చిన్నగా అవుతున్నదా? లేక జన్యుపరమైన సంబంధం ఉన్నదా? అనేది ఈ అధ్యయనంలో పరిశీలించారు. చివరికు తేలింది ఏమిటంటే.. ధూమపానానికి, మెదడు కుంచించుకుపోవడానికి మధ్య సంబంధాలు ఉన్నాయట!


అంతేకాదు.. ఓ మోస్తరుగా సిగరెట్లు తాగేవాళ్లకూ ఇదే డేంజర్‌ ఉంటే.. చైన్‌స్మోకర్లకు మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. పొగతాగడం దీర్ఘకాలం కొనసాగితే బాగుచేయలేనంత స్థాయిలో బ్రెయిన్‌ ఎఫెక్ట్‌ అవుతుందని తేల్చారు. ఫలితంగా అల్జీమర్స్‌, డిమెన్షియా వంటివాటికి గురవుతారని వార్నింగ్‌ ఇస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్‌కు గురైనవారిలో 14 శాతం మంది సిగరెట్‌ తాగేవారే ఉన్నారట! అయితే.. మీ బ్రెయిన్‌కు ఎఫెక్ట్‌ తగ్గాలంటే.. డిమెన్షియా, అల్జీమర్స్‌కు గురికాకూడదంటే.. సిగరెట్‌ మానేయడం ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Latest News