Research | టాయిలెట్‌ కుండీల కంటే వాటర్‌ బాటిళ్లే గలీజ్‌.. తాజా పరిశోధనలో వెల్లడి..!

Research : కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లేవాళ్లు తమ వెంట వాటర్‌ బాటిల్స్‌లో నీళ్లు తీసుకెళ్తుంటారు. ఈ రోజు తీసుకెళ్లిన బాటిల్‌నే మరుసటి రోజు శుభ్రం చేసుకుని వాడుతుంటారు. అయితే, ఇలా పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా (Bacteria) ఉంటుందట.

  • Publish Date - May 17, 2024 / 10:00 AM IST

Research : కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లేవాళ్లు తమ వెంట వాటర్‌ బాటిల్స్‌లో నీళ్లు తీసుకెళ్తుంటారు. ఈ రోజు తీసుకెళ్లిన బాటిల్‌నే మరుసటి రోజు శుభ్రం చేసుకుని వాడుతుంటారు. అయితే, ఇలా పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా (Bacteria) ఉంటుందట. ఎంతలా అంటే టాయిలెట్ కుండీలపై ఉండే బ్యాక్టీరియా కంటే 40 వేల రెట్లు అదనంగా మంచినీళ్ల బాటిళ్లపై ఉంటుందట.

అమెరికాకు చెందిన ‘వాటర్‌ ఫిల్టర్‌ గురు.కామ్‌’ వివిధ రకాల బాటిల్ మూతల నుంచి నమూనాలను సేకరించి, పరిశోధించింది. ఈ పరిశోధనల్లో మంచి నీళ్ల బాటిళ్లపై గ్రామ్-నెగెటివ్ రాడ్స్ (gram-negative rods), బాసిల్లస్‌ (bacillus) వంటి రెండు రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియావల్ల కలిగే ఇన్ఫెక్షన్‌తో యాంటీ బయోటిక్స్ పనిచేయకుండా పోతాయని, బాసిల్లస్‌ రకానికి చెందిన బ్యాక్టీరియా జీర్ణాశయ సంబంధిత సమస్యలకు కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు.

ఇక పునర్వినియోగ మంచినీళ్ల బాటిళ్ల శుభ్రతను పరిశోధకులు ఇతర వస్తువులు, పాత్రలతో పోల్చారు. కిచెన్‌ సింక్‌తో పోలిస్తే మంచినీళ్ల బాటిల్‌పై రెండు రెట్లు అదనంగా బ్యాక్టీరియా ఉందట. ఇక కంప్యూటర్ మౌస్‌తో పోలిస్తే నాలుగు రెట్లు అదనంగా బ్యాక్టీరియా కనిపించిందట. అయితే బాటిళ్లపై అధిక సంఖ్యలో బ్యాక్టీరియా వృద్ధి చెందినప్పటికీ వాటిలో అన్నీ ప్రమాదకర ఇన్‌ఫెక్షన్‌ కారకాలు కావని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వైద్య నిపుణులు వెల్లడించారు.

‘వాటర్‌ బాటిళ్ల కారణంగా అనారోగ్యానికి గురైన కేసుల గురించి నేను ఎప్పుడూ వినలేదు. అలాగే ట్యాప్‌ వాటర్‌లో కూడా బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు. కానీ మనిషి నోటిలో ఉండే బ్యాక్టీరియాతోనే వాటర్‌ బాటిళ్లు కలుషితమయ్యే అవకాశం ఉంది’ అని వారు తెలిపారు. అయితే మంచి నీళ్ల కోసం పునర్వినియోగించే బాటిళ్లను రోజుకు ఒకసారి సబ్బు కలిపిన వేడి నీటితో శుభ్రం చేస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

Latest News