Sukanya Samriddhi Yojana । సుకన్య సమృద్ధి యోజనలో నెలకు పదివేలు పొదుపు చేస్తే.. కూతురు ఎదిగే నాటికి చేతికి అందేది ఎంతో తెలుసా?

మీకు ఐదేళ్ల కూతురు ఉన్నదనుకోండి.. ఏటా 1.20 లక్షలు అంటే.. నెలకు పదివేల రూపాయల చొప్పున పొదుపు చేస్తే.. దానిపై 8.2 శాతం వడ్డీ చెల్లిస్తారు. అంటే.. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి మీరు పొదుపు చేసిన మొత్తం చక్రవడ్డీతో కలుపుకొని సుమారు 55.61 లక్షల రూపాయలు అవుతుంది.

  • Publish Date - September 5, 2024 / 09:11 PM IST

Sukanya Samriddhi Yojana । నేటి పురుషాధిక్య సమాజంలో ప్రత్యేకించి మధ్యతరగతి వర్గాల్లో ఆడపిల్లను చదివించడం, పెళ్లి చేసి అత్తారింటికి పంపడం అనేవి తల్లిదండ్రులకు భారీ టార్గెట్లు. అందుకోసం ఏదో ఒక రకంగా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటుంటారు. ఇలాంటి చిన్నమొత్తాల పొదుపు కోసం అద్భుతమైన పథకం ఒకటి ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi) (SSY). 2015లో కేంద్రం ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. తమ కూతుళ్ల భవితవ్యంపై తల్లిదండ్రులకు భరోసానివ్వడం కోసం బేటీ బచావో బేటీ పఢావో (Beti Bachao Beti Padhao) కార్యక్రమంలో భాగంగా దీనిని తీసుకొచ్చారు. ఆడపిల్లల చదువు ఖర్చులు, అనంతరం వారి వివాహ ఖర్చులు (girl child’s expenses) తల్లిదండ్రులకు సవాలుగా మారకుండా చూడటమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యాలు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో (SSY accounts) జమ చేసిన మొత్తానికి 2024 జూలై 1 నుంచి 2024 సెప్టెంబర్‌ 30 త్రైమాసికానికి 8.2 శాతం వార్షిక చక్రవడ్డీ (compounded interest rate) చెల్లిస్తారు. ప్రతి త్రైమాసికానికి ఈ వడ్డీ రేటును సవరిస్తారు. మార్కెట్‌లో చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోల్చితే ఇది ఎంతో మెరుగైనది.

 

ఇలా లెక్కించుకోవచ్చు..

మీకు ఐదేళ్ల కూతురు ఉన్నదనుకోండి.. ఏటా 1.20 లక్షలు అంటే.. నెలకు పదివేల రూపాయల చొప్పున పొదుపు చేస్తే.. దానిపై 8.2 శాతం వడ్డీ చెల్లిస్తారు. అంటే.. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి మీరు పొదుపు చేసిన మొత్తం చక్రవడ్డీతో కలుపుకొని సుమారు 55.61 లక్షల రూపాయలు అవుతుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం రూ.17.93 లక్షలు అయితే.. మీకు 21 ఏళ్లలో కలిసే వడ్డీ (interest rate) రూ.37.68 లక్షలు. అదే మీరు ఏటా 1.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే.. మెచ్యూరిటీ సొమ్ము (maturity amount) 69.8 లక్షలు అవుతుంది. అంటే.. ఇందులో మీరు పొదుపు చేసేది 22.5 లక్షలు అయితే.. దానిపై లభించే వడ్డీ 47.3 లక్షలన్నమాట. దీన్ని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉన్నది. అది.. A = P (1 + r/n) ^ nt. ఇందులో A అనేది చక్రవడ్డీ. P అనేది ప్రిన్సిపల్‌ ఎమౌంట్‌. r అంటే వడ్డీ రేటు.  ఒక ఏడాదిలో ఎన్నిసార్లు వడ్డీ కాంపౌండ్‌ అయిందనేది  n సూచిస్తుంది. T అంటే సంవత్సరాల సంఖ్య.

 

పన్ను రాయితీలు

అంతేకాదండోయ్‌.. సుకన్య సమృద్ధి యోజనలో ట్రిపుల్‌ e బెనిఫిట్లు కూడా ఉన్నాయి. అంటే.. ఎగ్జంప్ట్‌, ఎగ్జంప్ట్‌, ఎగ్జంప్ట్‌. ఈ పథకంలో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కు ట్యాక్స్‌ బెనిఫిట్లు ఉంటాయి. ఈ పథకంలో చేసే పొదుపు గరిష్ఠంగా 1.5 లక్షల వరకూ ఐటీ చెల్లింపుల సమయంలో సెక్షన్‌ 80సీ (Section 80C) కింద చూపించుకోవచ్చు. దీనిపై వచ్చే వార్షిక వడ్డీకి సైతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టం (Income Tax Act) సెక్షన్‌ 10 ప్రకారం మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ లేదా మధ్యలో విత్‌డ్రా చేసిన సమయంలో కూడా దీనికి ఎలాంటి ఆదాయం పన్ను వర్తించదు.

 

21 ఏళ్ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మరో కీలక అంశం లాక్‌ ఇన్‌ పీరియడ్‌. ఇది 21 ఏళ్ల వరకూ ఉంటుంది. ఉదాహరణకు.. బాలికకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఖాతా తెరిస్తే.. ఆ పాపకు 26 ఏళ్లు వచ్చేనాటికి ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది. ఇది కుటుంబంలో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా.. పథకం మెచ్యూరిటీ సమయానికి సదరు కుమార్తె విద్య, వివాహ అవసరాలకు గణనీయమైన మొత్తాన్ని అందిస్తుంది.

 

మధ్యలో విత్‌డ్రా చేసిన సొమ్ముకు ఆదాయం పన్ను ఉండదు

ఒకవేళ మధ్యలో ఈ ఖాతా నుంచి కొంత సొమ్ము విత్‌డ్రా (Premature withdrawals) చేసినా.. దానికీ ఆదాయం పన్ను వర్తించదు. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం (Government of India) ఆధ్యర్యంలోని పథకం కావడంతో మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. అయితే ఈ సొమ్ముపై మీరు రుణాలు తీసుకోవడానికి వీలు ఉండదు. మీ సమీపంలోని స్టేట్‌ బ్యాంక్‌కు వెళ్లి, పూర్తి వివరాలు తెలుసుకుని, మీ కుమార్తె భద్రమైన జీవితానికి పునాదులు వేసుకోండి.