జీవిత భీమా పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఉన్న తేడా ఏంటి? బీమా పాలసీలు ఒకేలా అనిపించినా ఒక్కో పాలసీ ప్రయోజనం ఒక్కో రకంగా ఉంటుంది. జీవిత భీమా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండూ అవసరమే. ఏదో ఒక్క పాలసీ చేస్తే సరిపోతోందని తప్పులో కాలేసినట్టే…. ఈ రెండు పాలసీలు ఒకే రకంగా ఉన్నా…. వాటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
జీవిత బీమా పాలసీతో ఉపయోగం ఏంటి?
కుటుంబ యజమాని లేదా కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు ఆర్ధికంగా ఆ కుటుంబానికి భద్రత కల్పించేదే జీవిత బీమా పాలసీ. ఇందులో కూడా రకాలుంటాయి. టర్మ్ ప్లాన్ ప్రకారం మీరు ఎంచుకొన్న పాలసీ మనుగడలో ఉన్న సమయంలోనే మరణిస్తే నామినీకి మీరు చేసిన ఇన్సూరెన్స్ విలువ మేరకు మీ కుటుంబానికి డబ్బులు అందిస్తారు. దీని ద్వారా మీ కుటుంబం అప్పులు తీర్చుకోవచ్చు. లేదా మీరు లేకున్నా ఆర్ధికంగా కొంత తోడ్పాటును అందించినట్టు అవుతుంది. మీ కుటుంబ సభ్యులకు దీని ద్వారా కొంత ఆర్ధిక వెసులుబాటు లభించే అవకాశం ఉంది.
ఆరోగ్య బీమా ఏమి చేస్తుంది?
ఒక ఆరోగ్య బీమా గురించి తెలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స ఖర్చులను భరిస్తుంది. ఆసుపత్రిలో చేరిన దగ్గరి నుంచి, శస్త్రచికిత్సలు, మందుల ఖర్చులను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. కొన్ని సమయాల్లో ఏదైనా వ్యాధి నివారణ ట్రీట్ మెంట్ కు కూడా పాలసీ నుంచి క్లైయిమ్ చేసుకోవచ్చు. ఆరోగ్య అత్యవసర సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనకు ఆర్ధికంగా భరోసాను కల్పించనుంది. ప్రతి సంవత్సరం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నందున హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆర్ధికంగా ఇబ్బందులు రాకుండా కాపాడుతాయి.
హెల్త్, జీవిత బీమా పాలసీల మధ్య తేడా ఏంటి?
జీవిత బీమా పాలసీ అనేది మీ కుటుంబానికి మీరు లేకున్నా ఆర్ధిక భద్రత ఇవ్వడానికి దోహదపడుతుంది. ఇక ఆరోగ్య బీమా అనేది మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించింది. పాలసీదారుడు మరణించిన తర్వాతే ఆ కుటుంబానికి దీని ద్వారా లబ్ది కలుగుతుంది. లేదా ఆ పాలసీ కాలపరిమితి పూర్తైన తర్వాత పాలసీ విలువ మీకు చెల్లిస్తారు. ఆరోగ్య బీమా ద్వారా అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన ఆసుపత్రి ఖర్చులు, శస్త్రచికిత్సలకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి క్లైయిమ్ చేసుకోవచ్చు. ఈ రెండు పాలసీల ప్రీమియంలు కూడా భిన్నంగా ఉంటాయి. జీవిత బీమా ప్రీమియం తక్కువ ఉన్నా అధిక కవరేజీని ఇస్తుంది. పాలసీదారుడి వయస్సు, ఆయన ఆరోగ్య పరిస్థితి, జబ్బుల ఆధారంగా ప్రీమియం ఉంటుంది.
రెండు పాలసీలు ఎందుకు అవసరం?
ప్రతి ఒక్కరికి ఈ రెండు పాలసీలు అవసరమే. ఒకదానిపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం. మీకు జీవిత బీమా మాత్రమే ఉంటే, మీ జీవితకాలంలో వైద్య బిల్లులను పొందలేరు. మీకు ఆరోగ్య బీమా మాత్రమే ఉంటే, మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే ఈ రెండు పాలసీలు తీసుకోవాలి.
