విధాత : పెర్త్ వేదికగా భారత్(India)తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్(1st ODI)లో ఆస్ట్రేలియా(Australia) 7 వికెట్ల తేడాతో విజయం(7-wicket win) సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించగా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. 131 పరుగుల లక్ష్యాన్ని 21.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మార్ష్ (46*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫిలిప్ (37) అసీస్ విజయానికి తనవంతు పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు. రెండో వన్డే గురువారం జరుగనుంది.
అంతకుముందు భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ వన్డేల్లో వరుసగా 16వ సారి టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరఫున తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డి అరంగేట్రం చేయగా..ఆసీస్ నుంచి రెన్షా ఎంట్రీ ఇచ్చాడు. పదేపదే వరుణుడు అంతరాయం కల్గించిన ఈ మ్యాచ్ ను చివరకు 26ఓవర్లకు కుదించారు. సుదీర్ఘ విరామం తర్వాతా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులకే ఔటవ్వగా..విరాట్ కోహ్లీ డకౌట్ అవుటయ్యాడు. కెప్టెన్ గిల్(10), శ్రేయస్ అయ్యర్(11), వాషింగ్టన్ సుందర్(10)లకే వెనుతిరిగారు. నితీష్ రెడ్డి 19 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) సహకారంతో భారత్ చివరకు 136/9 పరుగులు చేయగల్గింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, వోవెన్, కునెమన్ తలో 2 వికెట్లు తీయగా స్టార్క్, ఎలిస్ చెరో వికెట్ తీశారు.