Love Addict’s Violence| బాలిక మెడపై కత్తితో ప్రేమోన్మాది బెదిరింపు

విధాత : నిత్యం ఎక్కడో ఒక చోట ప్రేమోన్మాదులు దురాగతాలకు బాలికలు..మహిళలు గురువుతున్న ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ మైనర్ బాలిక తనను ప్రేమించడం లేదంటూ ఆమె మెడపై కత్తి పెట్టి చంపుతానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని సతారలో ప్రేమోన్మాది యువకుడు తన ప్రేమను నిరాకరించిందని 10వ తరగతి బాలికను చంపేందుకు యత్నించాడు. ఆమె స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా అడ్డుకున్నాడు. బాలిక మెడపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించాడు. అక్కడున్నవారు వారించినా వినలేదు.

అతను మాటలలో ఉండగానే ఓ వ్యక్తి చాకచక్యంగా అతడి వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు. వెంటనే మిగతావారు కూడా స్పందించి, బాలికను విడిపించారు. నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడు కత్తిని మెడపై పెట్టిన సందర్భంలో ఆ బాలిక ప్రాణభయంతో వణికిపోయింది. ఈ ఘటన ప్రేమోన్మాదుల అఘాయిత్యాలను మరోసారి చర్చనీయాంశం చేసింది.